
హోర్ముజ్ మూసినా.. రెండు వారాలు ముడి చమురుకు ఢోకాలేదు
ఇరాన్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూసివేత జరిగినా, ఇప్పటికిప్పుడు భారత్‌కు చమురు సరఫరాలో అంతరాయం ఉండే అవకాశం తక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దేశీయ రిఫైనరీలు 10–15 రోజుల ముడి చమురు నిల్వలు కలిగి ఉండగా, ఇంధన నిల్వలు మరో 7–10 రోజుల అవసరాలను తీర్చగలవని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రభుత్వ మీడియా, అమెరికా–ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిని మూసివేశామని ప్రకటించింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా అవుతుంది. ఆ మార్గాన్ని ఇరాన్ సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ నియంత్రిస్తోంది.
భారత్‌పై ప్రభావం ఎంత?
భారత్ తన అవసరమైన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో సుమారు సగం దిగుమతి చేసుకుంటోంది. కేప్లర్ నౌకా ట్రాకింగ్ డేటా ప్రకారం, రోజుకు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు — అంటే భారత్ దిగుమతుల్లో సుమారు 50 శాతం హోర్ముజ్ మార్గం గుండానే వస్తోంది. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి వస్తున్నాయి.
సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సుమారు 60 శాతం కూడా ఇదే మార్గం గుండా వస్తోంది. గృహ వినియోగ గ్యాస్ (ఎల్పీజీ) దాదాపు మొత్తంగా హోర్ముజ్ మార్గంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి దీర్ఘకాలిక మూసివేత జరిగితే గ్యాస్ సరఫరాలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సిద్ధంగా ప్రత్యామ్నాయాలు
ఒకవేళ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే, భారత్ తన దిగుమతులను పునర్వ్యవస్థీకరించగలదని అధికారులు తెలిపారు. అవసరమైతే రష్యా నుంచి మళ్లీ ఎక్కువ చమురు కొనుగోలు చేసే అవకాశముంది. ఇటీవల అమెరికా ఒత్తిడితో రష్యా దిగుమతులు తగ్గించినప్పటికీ, పరిస్థితి బట్టి మాస్కో వైపు మళ్లవచ్చని పేర్కొన్నారు. అయితే మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు నౌక ప్రయాణ సమయం సుమారు 5 రోజులు కాగా, రష్యా నుంచి రావడానికి కనీసం ఒక నెల పడుతుందని చెప్పారు. కాబట్టి ముందస్తు ఆర్డర్ల ప్రణాళిక కీలకం అవుతుందని వివరించారు. అదనంగా, వ్యూహాత్మక చమురు నిల్వలు సుమారు వారం రోజుల అవసరాలను తీర్చగలవని వెల్లడించారు.
ధరలపై ప్రభావం
సంక్షోభం ప్రభావం తొలుత ధరలపై కనిపించే అవకాశముంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 27న బ్యారెల్‌కు 72.87 డాలర్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి చమురు ధరలు సుమారు 16 శాతం పెరిగాయి. సరఫరాలో దీర్ఘకాలం అంతరాయం కొనసాగితే ధరలు 80 డాలర్ల దిశగా కదిలే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమోడిటీ విశ్లేషణ సంస్థ కేప్లర్‌కు చెందిన విశ్లేషకుడు సుమిత్ రితోలియా ప్రకారం, పూర్తి స్థాయి దీర్ఘకాలిక దిగ్బంధం అంచనాలు తక్కువగానే ఉన్నప్పటికీ, తాత్కాలిక అంతరాయాలు, రవాణా, బీమా ఖర్చులు పెరగడం వల్ల ధరల మధ్య అస్థిరత ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ పర్యవేక్షణ
ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భౌతిక సరఫరా కంటే ధరల మార్పులు, ఆర్థిక ప్రభావమే ప్రధాన ఆందోళనగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
