Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్

హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్

Gaddamidi Naveen
1 మార్చి, 2026

భాగ్యనగరంలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత మహిళల హాకీ జట్టు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంది. అంతకుముందు స్కాట్లాండ్ జట్టు కూడా నగరానికి చేరుకున్నాయి.

మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న ఈ ఎనిమిది దేశాల టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. సొంత గడ్డపై జరుగుతుండటం, స్థానిక ప్రేక్షకుల మద్దతు ఉండటంతో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బెంగళూరులో నెల రోజుల పాటు సాగిన శిక్షణ శిబిరంలో ఫిట్‌నెస్, వ్యూహాలపై పట్టు సాధించిన భారత క్రీడాకారిణులు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.

కెప్టెన్ల మాట

భారత కెప్టెన్ సలీమా టెటె మాట్లాడుతూ, హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. స్వదేశంలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. గత కొన్ని వారాలుగా కష్టపడి శిక్షణ పొందాం.. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం, వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం మా లక్ష్యం. ఇక్కడి ప్రేక్షకుల మద్దతు మాకు మరింత ప్రేరణ ఇస్తుందని అన్నారు.

స్కాట్లాండ్ కెప్టెన్ సారా రాబర్ట్‌సన్ మాట్లాడుతూ, భారత్‌కు రావడం ఇదే మా మొదటిసారి. మాకు ముందున్న సవాలు పెద్దదే అయినప్పటికీ, మేము సిద్ధంగా ఉన్నాం. వరల్డ్ కప్ అర్హత సాధించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

షెడ్యూల్, పూల్ వివరాలు

• ఈ టోర్నమెంట్‌లో భారత్, స్కాట్లాండ్ జట్లు పూల్-బిలో ఉరుగ్వే, వేల్స్ జట్లతో తలపడనున్నాయి.

• మార్చి 8: భారత్ వర్సెస్ ఉరుగ్వే (భారత్ తొలి మ్యాచ్) స్కాట్లాండ్ వర్సెస్ వేల్స్.

• మార్చి 9: భారత్ వర్సెస్ స్కాట్లాండ్.

• మార్చి 11: భారత్ వర్సెస్ వేల్స్; స్కాట్లాండ్ వర్సెస్ ఉరుగ్వే.

ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు, ఉరుగ్వేతో జరగనున్న తొలి మ్యాచ్‌తో తమ పోరాటాన్ని ప్రారంభించనుంది.

హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ - Tholi Paluku