Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో భారీగా హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లో భారీగా హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్‌

Pinjari Chand
18 ఆగస్టు, 2026

హైదరాబాద్‌లో భారీగా హషీష్‌(గంజాయి మొక్క నుంచి తయారు చేసే) ఆయిల్‌ను తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హషీష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో ఓ ఐటీ ఉద్యోగితో పాటు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా బెంగళూరుకు హషీష్‌ ఆయిల్‌ను తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో వనస్థలిపురం సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులు కిలో చొప్పున ప్యాకెట్లలో హషీష్‌ ఆయిల్‌ను ప్యాక్‌ చేసి, కాళ్లు, పొట్టకు అంటుకునే టేపుతో కట్టుకుని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరు మూడు కిలోల చొప్పున తరలిస్తుండగా మొత్తం 12 కిలోల హషీష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పాత నేరగాళ్లే ప్రధాన నిందితులు

ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గెమ్మెలి గ్రామానికి చెందిన జి.శ్రీను గతంలో గంజాయి, హషీష్‌ ఆయిల్‌ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీను, సరఫరాదారు కృష్ణ, బెంగళూరుకు చెందిన రిసీవర్‌ సిజోతో కలిసి మళ్లీ అక్రమ రవాణా ప్రారంభించినట్లు వెల్లడించారు. శ్రీను, అతని భార్య కలిసి పొరుగు గ్రామాలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బులు ఆశ చూపించి హషీష్‌ ఆయిల్‌ను తరలించేందుకు నియమించుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇదే విధంగా రవాణా చేసినట్లు పేర్కొన్నారు. తాజా సరుకు 12 కిలోలను బెంగళూరుకు చేర్చేందుకు సిజో రూ.10 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ మేరకు శ్రీను, అతని భార్యతో పాటు మరో నలుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రైవేట్‌ రవాణా ద్వారా హైదరాబాద్‌ మీదుగా బెంగళూరుకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. సరఫరాదారు కృష్ణ, బెంగళూరులో ఉన్న సిజో పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. హషీష్‌ ఆయిల్‌ సరఫరా నెట్‌వర్క్‌లో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో భారీగా హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్‌ - Tholi Paluku