
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రూ. 2.5 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం
నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్న 30 ఏళ్ల వ్యక్తిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం 'ఈగల్' బృందం శనివారం అరెస్ట్ చేశాయి. నిందితుడి వద్ద నుంచి రూ. 2.5 లక్షల విలువైన 330 గ్రాముల (200 మి.లీ) హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పక్కా సమాచారంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు దిగిన నిందితుడిని ఈగల్ బృందం అదుపులోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు నగరంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలోనూ గంజాయి విక్రయిస్తూ ఎన్డీపీఎస్ కేసుల్లో అరెస్టయి, నవంబర్ 2025లో బెయిల్‌పై బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత నిందితుడు సోషల్ మీడియా వేదికగా ఒడిశాకు చెందిన పరారీలో ఉన్న ఓ డ్రగ్ సరఫరాదారుతో పరిచయం ఏర్పడింది. అతడి నుంచి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
10 మి.లీ హ్యాష్ ఆయిల్‌ను రూ. 1,200 చొప్పున ఎల్బీనగర్, పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మంది కొనుగోలుదారులను అధికారులు గుర్తించారు. ఆగస్టు 2న ఒడిశాలోని పడువాకు వెళ్లిన నిందితుడు అక్కడి సరఫరాదారు నుంచి 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఆగస్టు 7న విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఈగల్ బృందం అతడిని పట్టుకుంది.
పోలీసుల కంటపడకుండా ఉండేందుకు నిందితుడు కేవలం బస్సుల్లో ప్రయాణిస్తూ, వినియోగదారులతో సోషల్ మీడియా ద్వారానే సంప్రదింపులు జరుపుతూ, రవాణాకు బస్సులను మాత్రమే ఉపయోగించేవాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న ఒడిశా సప్లయర్ కోసం గాలిస్తున్నారు.
