
హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై న్యాయవాదుల ఆందోళన: హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులపై న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాది కె. కరుణా సాగర్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వందల సంఖ్యలో అక్రమ బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులు స్థిరపడినట్లు న్యాయవాది కరుణా సాగర్ ఆరోపించారు. అంతర్జాతీయ సరిహద్దులను అక్రమంగా దాటి వచ్చిన వారు ఎలాంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేకుండానే ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు వంటి కీలక భారతీయ పత్రాలను పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ అక్రమ పత్రాల ఆధారంగా వారు బ్యాంక్ ఖాతాలు తెరవడం, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబాలు నడపడం, వ్యాపారాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇది కేవలం చట్టవిరుద్ధమే కాకుండా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని, అలాగే ప్రాంతంలోని జనాభా స్వరూపాన్ని మార్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ అంశంపై జనవరి 4, 2026న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు కరుణా సాగర్ తెలిపారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారి పత్రాలను ధృవీకరించి, దేశం నుంచి వెలివేయాలని కోరినప్పటికీ, 15 రోజులు గడిచినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదా చర్య కనిపించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ త్వరలోనే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.
