
హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి ఈమెయిల్ బాంబు బెదిరింపులు
హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో ఉన్న ఐఎండీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరింపు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ మెయిల్‌లో భవనంలో మొత్తం 14 ఆర్‌డీఎక్స్ బాంబులు అమర్చినట్లు పేర్కొనడంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకున్నారు. భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయ భవనాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రతి గది, ప్రతి అంతస్తును పరిశీలించినప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ, బేగంపేటలోని ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుని భవనం మొత్తాన్ని పరిశీలించాయి. అయితే ఎలాంటి బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
వరంగల్ కోర్టులోనూ ఇలాగే..
ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణలో ఇలాంటి మరో ఘటన కూడా చోటుచేసుకుంది. ఫిబ్రవరి 26న వరంగల్ జిల్లా కోర్టుకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాంబు నిర్వీర్య బృందాలతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
