Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

Gaddamidi Naveen
9 మార్చి, 2026

హైదరాబాద్‌లోని హైడ్రా ప్రజావాణికి సోమవారం మొత్తం 32 ఫిర్యాదులు అందాయని హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య తెలిపారు. స్మశాన వాటికలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు అందజేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధ్యతలు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

స్మశాన వాటికల వరకు ఆక్రమణదారులు దాటి వెళ్లి ఇళ్లు నిర్మిస్తున్నారని పలువురు ప్రజలు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని వినతిపత్రాలు సమర్పించారు. హైడ్రా చేపడుతున్న చెరువుల అభివృద్ధి పనులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, తమ ప్రాంతాల్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు. ముందుగా మురుగునీటిని బయటకు పంపించి గుర్రపుడెక్కను తొలగించి, గొలుసుకట్టు చెరువుల తరహాలో అభివృద్ధి చేస్తే నగరంలో వరద ముప్పు తగ్గుతుందని కాలనీ వాసులు సూచించారు.

యూసుఫ్‌గూడ, మధురానగర్ ప్రాంతాల్లోని కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువును విస్తరించి అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ కోరింది. గతంలో ఉన్న చెరువును చాలా వరకు పూడ్చి పార్కు నిర్మించారని, ప్రస్తుతం ఉన్న చెరువు నిర్వహణ లేక దుర్గంధంగా మారిందని తెలిపారు. స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నంబర్-4 భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన బౌండరీ వాల్‌ను ధ్వంసం చేసి పార్క్ భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని తెలిపారు.

అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని టీఎన్జీఓ కాలనీలో ప్లాట్ నంబర్ 311 వద్ద సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు పేర్కొన్నారు. శంషాబాద్‌లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో ఉన్న చర్చి సమాధుల భూమిపై కూడా అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందిందని, ఈ భూమిపై రికార్డులు మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు - Tholi Paluku