
హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తక్షణమే వీడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే ఈ ప్రభుత్వానికి, అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఓవైసీ కళాశాల చెరువు ఆక్రమణ మాత్రం ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓవైసీ కళాశాల చెరువుపై నిర్మించబడిందని ప్రపంచమంతా చూస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని చూడనట్లుగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులకు కంటి చూపు సమస్య ఉందేమోనని ఎద్దేవా చేస్తూ, వారికి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు, స్నేహితులకు అనుగుణంగా ఎఫ్‌టీఎల్ గీతలను మ్యాజిక్‌లా మారుస్తోందనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా అమలవ్వాలి కానీ, ఇలా ఎంపిక చేసుకున్న వారిపై మాత్రమే కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కంటి పరీక్షల తర్వాత కూడా వారికి ఆ చెరువు కనిపించకపోతే.. సమస్య వారి కంటి చూపులో లేదు, వారి చేసే రాజకీయాల్లోనే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
