
హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ప్రొఫైల్‌లు పబ్లిక్‌గా ఉంచాలి: ట్రంప్ సర్కార్
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు (భారతీయులతో సహా) ట్రంప్ ప్రభుత్వం మరో కఠినమైన నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై హెచ్-1బీ, వారిపై ఆధారపడిన హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి) ప్రైవసీ సెట్టింగ్స్‌ను 'పబ్లిక్'గా (అందరికీ కనిపించేలా) ఉంచాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాపై నిఘా ఎందుకు?
అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదు, ప్రత్యేక అవకాశం మాత్రమే అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజల భద్రతకు ఎవరైనా దరఖాస్తుదారులు ముప్పు కలిగిస్తారేమోనని ముందే గుర్తించడానికి, అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపింది. "ప్రతి వీసా మంజూరు నిర్ణయం ఒక జాతీయ భద్రతా నిర్ణయమే" అని పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ఎవరెవరికి వర్తిస్తుంది?
ఇదివరకే విద్యార్థులు (ఎఫ్, ఎం వీసా), ఎక్స్ఛేంజ్ విజిటర్లు (జే వీసా) ఈ తనిఖీకి లోబడి ఉన్నారు. ఇప్పుడు హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు కూడా ఈ పరిశీలన కిందకు వచ్చారు. వీసా దరఖాస్తుదారులు అమెరికన్లకు హాని చేసే ఉద్దేశంలో లేరని, అలాగే తమ వీసా నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నారని నిరూపించుకోవడానికి ఈ నిఘా అవసరమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
హెచ్-1బీపై ఇప్పటికే ఉన్న ఆంక్షలు
వరుసగా వలస నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్ పాలనలో ఇదొక తాజా చర్య. అమెరికా టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం భారీ ఆంక్షలను అమలు చేస్తోంది. గతంలో కొత్త హెచ్-1బీ వర్క్ వీసాలపై ఒకేసారి లక్ష డాలర్ల (సుమారు రూ. 80 లక్షలకు పైగా) భారీ ఫీజు విధించే నిబంధనను కూడా ట్రంప్ ప్రకటించారు. ఇది భారతీయ టెక్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది.
19 దేశాల వారికి గ్రీన్ కార్డులు నిలిపివేత
ఇది మాత్రమే కాకుండా, ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల ఘటన తర్వాత అమెరికా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న 19 "సమస్యాత్మక దేశాల" పౌరులకు గ్రీన్ కార్డ్, అమెరికా పౌరసత్వం, ఇతర వలస దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ వంటి 19 దేశాల పౌరుల ఆశ్రయం, వలస దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ని ఆదేశించింది. కాగా ఈ కొత్త నిబంధనలు అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ టెక్ నిపుణులు, వారి కుటుంబాలపై మరిన్ని ఇబ్బందులు పెంచే అవకాశం ఉంది.
