
హుజూర్‌నగర్, కోదాడలో రూ.130 కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని రహదారుల రూపురేఖలు త్వరలో మారనున్నాయి.ఈ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ లైన్‌గా ఉన్న రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు మొత్తం సుమారు 49 కిలోమీటర్ల పనులకు రూ.130 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం మార్చి 5న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషితో ఈ నిధులు విడుదలయ్యాయి.
మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్ కింద మొత్తం రూ.130 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరం కావడంతో పాటు వాణిజ్య, వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఊతం లభించనుంది.
హుజూర్‌నగర్ నియోజకవర్గం రూ.62 కోట్లు
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో రూ.62 కోట్లతో మొత్తం 26.50 కిలోమీటర్ల రహదారులను డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనుల ద్వారా సుమారు 15 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. ఇందులో చింతలపాలెం నుంచి కిస్టాపురం వరకు 9.20 కిలోమీటర్ల రహదారిని డబుల్ రోడ్డుగా నిర్మించనున్నారు. ఈ మార్గం ద్వారా చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిస్టాపురం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది.
అలాగే రామలక్ష్మిపురం నుంచి హుజూర్‌నగర్ బైపాస్ వరకు 3.80 కిలోమీటర్ల రహదారి విస్తరణ చేపడతారు. దీని వల్ల రామలక్ష్మిపురం, యర్రారం, హుజూర్‌నగర్ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం పెరుగుతుంది. మరోవైపు అమరవరం నుంచి కొత్తతండ వరకు 5.50 కిలోమీటర్ల రహదారిని రూ.30 కోట్లతో విస్తరించనున్నారు. దీనివల్ల అమరవరం, అంజలిపురం తండ, కొత్తతండ గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా గుడుగుంట్లపాలెం నుంచి ఎల్లాపురం వరకు 8 కిలోమీటర్ల రహదారి డబుల్ లైన్‌గా మారనుంది.
కోదాడ నియోజకవర్గం రూ.68 కోట్లు
ఇక కోదాడ నియోజకవర్గంలో రూ.68 కోట్లతో 22.60 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నారు. కోదాడ నుంచి అనంతగిరి వరకు 6.60 కిలోమీటర్ల రహదారిని 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. దీని వల్ల కోదాడ, ఖానాపురం, అనంతగిరి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభమవుతాయి. అదే విధంగా ఎన్ హెచ్-9 నుంచి నేలమర్రి వరకు 10 కిలోమీటర్ల రహదారిని డబుల్ లైన్‌గా మార్చనున్నారు.అలాగే కాపుగల్లు నుంచి దోరకుంట వరకు 6 కిలోమీటర్ల రహదారి కూడా విస్తరించనున్నారు.
ఈ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, వెంటనే టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయ్యాక ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
