
హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి హైడ్రా తనిఖీలు
నగరంలోని హాస్టళ్లలో నివసిస్తున్న వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన, అనుమతులు లేని భవనాల్లో హాస్టళ్లను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పటిష్టమైన నిర్మాణంతో పాటు అన్ని అనుమతులు ఉన్న భవనాల్లోనే హాస్టళ్లను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ప్రమాదకర భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను సురక్షిత భవనాలకు తరలించేందుకు నిర్వాహకులకు మూడు నెలల గడువు ఇచ్చారు.
గడువు పూర్తైన అనంతరం జనవరి 1 నుంచి హైడ్రా తనిఖీలు చేపట్టనుంది. కూలిపోయే ప్రమాదం ఉన్న భవనాలను తొలగించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే హాస్టళ్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఇటీవల గచ్చిబౌలిలోని ఆంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందడం, పక్కనున్న భవనాలు దెబ్బతినడం, దేశ రాజధానిలో ఈ నెల 6న హాస్టల్ భవనం కూలి ఏడుగురు మృతి చెందడం వంటి ఘటనల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో నగరంలోని హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, భవన నిర్మాణ పటిష్టత వంటి అంశాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
అనుమతి లేని భవనాల్లో హాస్టళ్ల నిర్వహణపై మూడు కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుని తనిఖీలు, తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. తక్కువ ఫీజుల కోసం నివాసితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని సూచించారు. హాస్టల్ ఎంపికకు ముందు అగ్నిప్రమాదం జరిగితే సులభంగా బయటపడే మార్గాలు, భవనం పటిష్టత, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించాలని కోరారు.
50 గజాల్లో ఏడు అంతస్తుల భవనాలు నిర్మించడం అత్యంత ప్రమాదకరమని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఆంజయ్యనగర్‌లో కూలిన భవనం సమీపంలోని ప్రమాదకరమైన ఆరు భవనాలను తొలగించినట్లు తెలిపారు. సిద్ధిక్‌నగర్‌లో 2024లో భవనం పక్కకు ఒరిగిన ఘటనను కూడా గుర్తు చేశారు. నగరంలో ఇప్పటికే నిర్వహించిన తనిఖీల్లో అనేక హాస్టళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. భవనాల్లో అగ్ని ప్రమాదాల కారణాలు, పాటించాల్సిన భద్రతా నిబంధనలు, అనుమతి లేని, కాలపరిమితి దాటిన నిర్మాణాల వల్ల పొంచి ఉన్న ముప్పును హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య వివరించారు.
