Let's talk: editor@tmv.in
హంతకుడే సంతాపం తెలిపినట్లుంది: హరీశ్‌రావుపై పొంగులేటి కౌంటర్

హంతకుడే సంతాపం తెలిపినట్లుంది: హరీశ్‌రావుపై పొంగులేటి కౌంటర్

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

ప్రతిపక్ష హోదాలో ఉండి నిరంతరం అబద్ధాలు చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం తప్ప బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు.

కమిషన్లు, అవినీతి గురించి హరీశ్‌రావు మాట్లాడుతుంటే "హంతకుడే సంతాపం తెలిపినట్లుంది" అని మంత్రి ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి స్వయంగా కేసీఆర్ కుమార్తె, కవిత అనేక సందర్భాల్లో వివరించిన విషయాన్ని హరీశ్‌రావు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అవినీతి గురించి హరీశ్‌రావు నీతి వాక్యాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలే నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రబ్బరు చెప్పులతో తిరిగిన అగ్గిపెట్టె రావు పదేళ్ల అధికారంలో విచ్చలవిడిగా దోచుకుని తరతరాలకు తరగని ఆస్తి సంపాదించారని, అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించారో ఆ రహస్యం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలో దోచుకున్నది బీఆర్ఎస్ నేతలేనని మంత్రి ఆరోపించారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల మీద పనులు జరిగినట్లే ఈ ప్రభుత్వంలోనూ జరుగుతుందనుకోవడం వారి భ్రమ అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదని నిరూపించుకుందని మంత్రి దుయ్యబట్టారు.

హంతకుడే సంతాపం తెలిపినట్లుంది: హరీశ్‌రావుపై పొంగులేటి కౌంటర్ - Tholi Paluku