
‘స్లమ్ ఫ్రీ’ నగరంగా చండీగఢ్
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను స్లమ్రహిత (అక్రమంగా ఏర్పడిన, మౌలిక సదుపాయాలు లేని నివాస ప్రాంతం) నగరంగా అధికారికంగా ప్రకటించినట్లు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ సోమవారం తెలిపారు. ఇకపై కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవడంపై, అలాగే ప్రజాస్థలాల్లో ఉన్న చిన్నచిన్న ఆక్రమణలను తొలగించడంపై పరిపాలన యంత్రాంగం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. మేము చండీగఢ్‌ను స్లమ్రహిత నగరంగా ప్రకటించాం. ఇప్పుడు వెండింగ్ జోన్లు, రహదారుల పక్కలు, గ్రీన్ బెల్టుల వంటి ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆక్రమణలపై చర్యలు కొనసాగుతున్నాయని యాదవ్ తెలిపారు. ఆక్రమణలు మళ్లీ ఏర్పడకుండా ఉండేందుకు సెక్టార్ వారీగా అధికారులకు బాధ్యతలు కేటాయించామని, తమ పరిధిలో కొత్తగా ఎలాంటి ఆక్రమణలు లేవని ధృవీకరిస్తూ ప్రతి రెండు వారాలకు ఒకసారి అఫిడవిట్లు సమర్పించాలని వారికి ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కొత్తగా స్లమ్‌లు ఏర్పడకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించాం. ప్రస్తుతం చిన్న ఆక్రమణలను కూడా తొలగించే ప్రక్రియ ప్రారంభించామని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.
గోశాల ఘటనపై విచారణ చేస్తున్నాం
ఇదే సందర్భంలో రాయ్‌పూర్ కలాన్‌లోని గోశాలలో ఆవుల మృతి ఘటనలపై వచ్చిన కథనాలపై కూడా ఆయన స్పందించారు. మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆ గోశాలలో మొత్తం 47 ఆవులు మృతిచెందినట్టు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని, యూటీ అడ్మినిస్ట్రేటర్ కూడా గోశాలను సందర్శించినట్లు చెప్పారు. విచారణ నివేదిక మూడు నుంచి నాలుగు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా నగరంలోని ఇతర ప్రాంతాల్లో మృతి చెందిన పశువుల శవాలను పూడ్చడం లేదా దహనం చేయడం కోసం ఈ గోశాలకు తీసుకువచ్చినట్టు కనిపిస్తున్నాయని యాదవ్ వెల్లడించారు. అన్ని అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
