
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 39కి చేరిన మృతుల సంఖ్య
స్పెయిన్ దేశంలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ స్పెయిన్‌లోని అడముజ్ సమీపంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 39కి చేరుకుంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
ఆదివారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాలాగా నగరం నుండి రాజధాని మాడ్రిడ్ వైపు సుమారు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక హైస్పీడ్ రైలు వెనుక భాగం అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలును ఇది బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు రైళ్లు నుజ్జునుజ్జయ్యాయి.
ముందు భాగపు బోగీల్లోనే భారీ ప్రాణనష్టం
రవాణా మంత్రి ఆస్కర్ పుయెంటే వెల్లడించిన వివరాల ప్రకారం, ఎదురుగా వస్తున్న రైలు ఇంజిన్, దాని వెనుక ఉన్న మొదటి రెండు బోగీలు ఈ ఢీ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ బోగీలు పట్టాలు తప్పి ఏకంగా నాలుగు మీటర్ల లోతైన లోయలోకి పడిపోయాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది ఈ బోగీల్లో ప్రయాణిస్తున్న వారేనని ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాద స్థలంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. అండలూసియా ప్రాంత అధ్యక్షుడు హువాన్మా మోరెనో మాట్లాడుతూ.. ఇనుప ముద్దల్లా మారిపోయిన బోగీలను చూస్తే ఢీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్ల సహాయంతో ఆ ఇనుప శిథిలాలను తొలగిస్తున్నామని, అప్పుడే మృతుల పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలు లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చినట్టుగా అనిపించిందని, క్షణాల్లో రైలు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కిటికీలు పగిలిపోవడంతో కొందరు, ఎమర్జెన్సీ సుత్తులతో అద్దాలను పగలగొట్టుకుని మరికొందరు ప్రాణాలు చేతబట్టుకుని బయటపడ్డారు.
క్షతగాత్రుల పరిస్థితి
ఈ ప్రమాదంలో మొత్తం 159 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా ఆడముజ్ పట్టణంలోని ఒక క్రీడా కేంద్రాన్ని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
ఘటన జరిగిన వెంటనే స్పానిష్ రెడ్ క్రాస్, సివిల్ గార్డ్, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రంతా మంచును, చీకటిని లెక్క చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్–అండలూసియా మధ్య రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
విచారణకు ఆదేశం
ఈ ప్రమాదంపై రవాణా మంత్రి పుయెంటే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చోట పట్టాలు చాలా నిటారుగా ఉన్నాయని, ఇటీవలే అక్కడ మరమ్మతులు కూడా చేశామని తెలిపారు. పైగా పట్టాలు తప్పిన రైలు కేవలం నాలుగేళ్ల క్రితమే తయారైన కొత్త రైలు కావడం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక రావడానికి సుమారు నెల రోజులు పట్టే అవకాశం ఉంది.
ప్రధాని దిగ్భ్రాంతి
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "మన దేశానికి ఇది అత్యంత వేదన కలిగించిన రాత్రి" అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోమవారం ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్పెయిన్ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ (3,100 కి.మీ) కలిగిన దేశాలలో ఒకటి. సాధారణంగా ఇక్కడ ప్రయాణాలు అత్యంత సురక్షితమని పేరుంది. అయితే తాజా ఘటనతో 2013లో 80 మందిని బలితీసుకున్న రైలు ప్రమాదాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి అటువంటి ప్రమాదం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
