
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ నేటికి వాయిదా
ఓంబిర్లాను లోక్‌సభ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కాలేదు. పశ్చిమాసియా సంక్షోభంపై వెంటనే చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సభ తీసుకోలేకపోయింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పై ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరగనున్న చర్చకు ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానం ఇచ్చే అవకాశముందని ప్రభుత్ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌రిజిజుతో పాటు ప్రభుత్వం తరఫున మరికొంత మంది నేతలు కూడా చర్చలో పాల్గొననున్నారు. ఈ చర్చ మంగళవారం జరిగే అవకాశముంది. సోమవారం ఈ తీర్మానంపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ, పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ కోరుతూ ప్రతిపక్షం చేసిన నిరసనలతో లోక్‌సభ పునరావృతంగా వాయిదా పడటంతో అది జరగలేదు.
సభలో ఉద్రిక్తత
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ సభ్యులను శాంతించమని కోరుతూ స్పీకర్‌పై ఉన్న అవిశ్వాస తీర్మానాన్ని ముందుగా చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతిపక్షం మాత్రం పశ్చిమ ఆసియా అంశంపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టింది. జగదంబికా పాల్ మాట్లాడుతూ ప్రతిపక్షం ప్రవర్తన వల్ల ప్రతిరోజు సుమారు రూ.9 కోట్ల ప్రజా ధనం వృథా అవుతోందని విమర్శించారు. సభను ‘బందీగా’ ఉంచడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ పశ్చిమ ఆసియా పరిస్థితిపై ప్రకటన ఇస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్‌ను తొలగించే తీర్మానాన్ని ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షమే సభను అడ్డుకుంటోందని ఆయన అన్నారు.
లోక్‌సభలో స్పీకర్‌గా వ్యవహరిస్తున్న ఓం బిర్లా సభా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. బడ్జెట్ సమావేశాల మొదటి భాగంలో 118 మంది ప్రతిపక్ష ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీలు ముహమ్మద్ జవాద్, కే.సురేశ్, మల్లురవి ప్రవేశపెట్టనున్నారు.
సభలో ప్రతిపక్ష నేతలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడం, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై అనవసర ఆరోపణలు చేయడం వంటి విషయాలను ఈ తీర్మానంలో ప్రస్తావించారు. ప్రజా సమస్యలను లేవనెత్తినందుకు ప్రతిపక్ష ఎంపీలను ఒక పూర్తి సమావేశ కాలం పాటు సస్పెండ్ చేయడం కూడా ఇందులో పేర్కొన్నారు. స్పీకర్ సభలో తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యతను నిలబెట్టుకోలేకపోయారని ప్రతిపక్షం ఆరోపించింది. అధికార పక్ష అభిప్రాయాన్నే బహిరంగంగా సమర్థిస్తున్నారని కూడా విమర్శించింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌కు సభలో హాజరు కావడానికి, తనను తాను సమర్థించుకోవడానికి, తీర్మానంపై ఓటు వేయడానికి హక్కు ఉంది. అయితే ఆ సమయంలో ఆయన సభను అధ్యక్షత వహించలేరు. ఓటింగ్ జరిగితే ఇతర సభ్యుల్లా ఆటోమేటెడ్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించలేకపోవచ్చు. ఆయన ఓటు నమోదు చేయడానికి ప్రత్యేక స్లిప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీకర్ బిర్లాను ప్రశంసించారు. ఆయన అద్భుతమైన ఎంపీగా, అలాగే లోక్‌సభ స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
