Let's talk: editor@tmv.in
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం: ఎంపీ మిథున్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం: ఎంపీ మిథున్‌రెడ్డి

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

స్థానిక సంస్థల ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సగం కాలాన్ని పూర్తి చేసుకుందని, టీడీపీ ప్రభుత్వానికి ఇంటర్వెల్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగాల నియామకాలు చేపట్టినా ఎలాంటి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై విమర్శలు చేశారు. రెండేళ్లుగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగాల కోసం విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇకపై ఏ కార్యకర్తపై అక్రమ కేసు నమోదైనా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 10 వేల మందికి పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేస్తున్నామని, రెండు వారాల్లో వాటిని అందజేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం జడ్పీతో పాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమైతే 2029 ఎన్నికల్లో విజయానికి బాటలు పడతాయని అన్నారు.

పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయని అన్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండటం వైఎస్సార్‌సీపీకి కొత్త కాదన్నారు. 2014లో ఓటమి తర్వాత కూడా కార్యకర్తలు అధైర్యపడకుండా పనిచేసి 2019లో విజయం సాధించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత బలంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, మట్టి, ఇసుక, మద్యం మాఫియాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికలకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాప్రతినిధుల అవినీతి, సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలుపై ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం: ఎంపీ మిథున్‌రెడ్డి - Tholi Paluku