Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
సైబర్ నేర బాధితులకు భరోసా ఇస్తున్న ‘సీ-మిత్ర’

సైబర్ నేర బాధితులకు భరోసా ఇస్తున్న ‘సీ-మిత్ర’

Gaddamidi Naveen
19 జనవరి, 2026

సైబర్ నేర బాధితులకు వేగవంతమైన న్యాయం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ‘సీ-మిత్ర’ ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేసిన ఈ విధానం, ప్రారంభమైన కేవలం 10 రోజుల్లోనే వందలాది మంది సైబర్ బాధితులకు ఊరట కలిగించింది.

సీ-మిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను తెలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రోజుకు సగటున 100 వరకు ఫోన్ కాల్స్ చేస్తూ, బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సైబర్ మోసానికి గురై ఆందోళనలో ఉన్నవారికి భరోసా కల్పిస్తూ, తదుపరి చర్యలపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

బాధితులకు ఫిర్యాదు రాయడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇప్పటివరకు 200 మందికి పక్కాగా లీగల్ అంశాలతో కూడిన ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సీ-మిత్ర బృందం సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్ట్‌లను వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా బాధితులకు పంపించి, వారు సంతకం చేసిన ప‌త్రాల‌ను అందగానే ఎలాంటి జాప్యం లేకుండా 100కు పైగా ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలు నేరుగా మొబైల్‌కు మెసేజ్ రూపంలో చేరుతుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సైబర్ నేర బాధితులు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే ‘సీ-మిత్ర’ బృందం స్పందిస్తుంది. బాధితులను సంప్రదించి వివరాలు తెలుసుకున్న అనంతరం, ఇంటి నుంచే ఫిర్యాదు చేసే విధంగా సహకారం అందిస్తోంది. స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసుల సేవలు అందుబాటులో ఉండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సైబర్ క్రైం విభాగం 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్ట్‌లలో ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ పనిచేస్తోంది. జనవరి 9న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సీ-మిత్ర ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య నమ్మకానికి వంతెన ఏర్పడిందని మహిళా కానిస్టేబుళ్లు దీక్షిత, పృథ్వీక తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఒక్క సైబర్ బాధితుడు కూడా లేకుండా చేసి, సీ-మిత్ర అవసరం లేకుండా మారాలన్నదే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. టెక్నాలజీకి మానవతను జోడిస్తూ హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం, సైబర్ నేరాలపై పోరాటంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది.

సైబర్ నేర బాధితులకు భరోసా ఇస్తున్న ‘సీ-మిత్ర’ - Tholi Paluku