Let's talk: editor@tmv.in
సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లో ‘పింక్‌ పవర్‌ రన్‌’

సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లో ‘పింక్‌ పవర్‌ రన్‌’

Pinjari Chand
8 సెప్టెంబర్, 2026

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనతోపాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న ‘పింక్‌ పవర్‌ రన్‌’ మూడో ఎడిషన్‌ ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనుంది. సుధా రెడ్డి ఫౌండేషన్‌, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ హాఫ్‌ మారథాన్‌, కమ్యూనిటీ ఫిట్‌నెస్‌ కార్యక్రమానికి 20 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం రూ.75 లక్షల ప్రైజ్‌మనీ ఉండగా.. 100 మందికి పైగా విజేతలకు బహుమతులు అందించనున్నారు.

తొలిసారి అధికారిక హాఫ్‌ మారథాన్‌

ఈసారి తొలిసారిగా 21.097 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌ను నిర్వహించనున్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్స్‌ అండ్‌ డిస్టెన్స్‌ రేసెస్‌ (ఏఐఎంఎస్‌) నుంచి దీనికి ధ్రువీకరణ లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీనితోపాటు 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ. విభాగాల్లోనూ పరుగులు నిర్వహించనున్నారు.

ఆరోగ్యంపై అవగాహన కోసమే

పింక్‌ పవర్‌ రన్‌ కేవలం క్రీడా కార్యక్రమానికే పరిమితం కాదని సుధా రెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ సుధా రెడ్డి తెలిపారు. ఫిట్‌నెస్‌, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, వ్యాధులను తొలిదశలో గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేయడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌పై కీలకమైన అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.

ఆరోగ్యకరమైన సమాజం కోసం

మిస్‌ వరల్డ్‌ 2025 ఒపల్‌ సుచతా చువాంగ్‌స్రీ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. పింక్‌ పవర్‌ రన్‌ వంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని, మారథాన్‌లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో దీర్ఘకాలిక ఆరోగ్య అవగాహన పెరుగుతుందని అన్నారు.