Let's talk: editor@tmv.in
సెప్టెంబర్‌ 1న సీపీఐ ‘చలో ఢిల్లీ’

సెప్టెంబర్‌ 1న సీపీఐ ‘చలో ఢిల్లీ’

Pinjari Chand
21 ఆగస్టు, 2026

ప్రజల గొంతు నొక్కితే నిశ్శబ్దం అవుతారని ప్రధాని మోదీ భావిస్తే అది ఆయన భ్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై సీపీఐ సమరశంఖం పూరిస్తుందని హెచ్చరించారు. పలాసలో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించారు. అప్పులు పెంచుతూ, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తూ, ప్రజలపై భారాలు మోపడం అభివృద్ధి కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు.

ప్రశ్నించే వారిని ‘దిమాగ్‌ నక్సల్‌’ అంటారా?

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ‘దిమాగ్‌ నక్సల్‌’ అంటూ ముద్ర వేయడం సరికాదని ఈశ్వరయ్య అన్నారు. మోదీ ఎలాంటి పేర్లు పెట్టినా ప్రజల ప్రశ్నలు ఆగవని, యువత, ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు?

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై కూడా ఈశ్వరయ్య విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లు రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ‘డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం’ అంటూ ప్రచారం చేయడం తప్ప.. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం

వంశధార–నాగావళి నదుల అనుసంధానం, ఉత్తరాంధ్ర సాగునీటి సమస్యలు, గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతున్నట్లు ప్రచారం చేయడం కాకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల సమస్యలు, ఐటీడీఏ ఏర్పాటు, సాగునీరు, ఉపాధి వంటి అంశాలపై సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని ప్రకటించారు.

స్థానిక ఎన్నికల్లో ప్రజల గొంతుకగా సీపీఐ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల గొంతుకగా సీపీఐ బరిలోకి దిగుతుందని ఈశ్వరయ్య తెలిపారు. ప్రజల హక్కులను హరించే ప్రభుత్వాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

సెప్టెంబర్‌ 1న సీపీఐ ‘చలో ఢిల్లీ’ - Tholi Paluku