Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
సూరత్‌లో 1401 కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం

సూరత్‌లో 1401 కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో కల్తీ ఆహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ చర్యలు చేపట్టారు. సూరత్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఒక డెయిరీ యూనిట్‌పై అకస్మిక దాడి నిర్వహించగా, అక్కడ నిల్వ ఉంచిన 1401 కిలోల పన్నీర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో ఆ పనీర్ కల్తీ అయి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

తనిఖీల సమయంలో ఆ యూనిట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ యూనిట్‌లోని పన్నీర్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యలు ప్రారంభించారు.

స్వాధీనం చేసుకున్న పన్నీర్ నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. వినియోగదారుల ఆరోగ్యం దృష్ట్యా కల్తీ ఆహార తయారీ విక్రయాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆహార భద్రతపై తనిఖీలు పెంచుతున్న నేపథ్యంలో, సూరత్‌లో జరిగిన ఈ దాడి వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దేశంలోని పలు నగరాల్లో ఇటీవల నకిలీ పన్నీర్ తయారీ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా పన్నీర్‌ను పాలను మరిగించి, నిమ్మరసం లేదా వెనిగర్‌తో విరిగించి తయారు చేస్తారు. అయితే అక్రమంగా పనిచేసే కొంతమంది తయారీదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు పాలు బదులుగా స్టార్చ్, మైదా, వెజిటబుల్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వంటి పదార్థాలు ఉపయోగించి నకిలీ పన్నీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పదార్థాలను నీటితో కలిపి వేడి చేసి గడ్డలా మారేలా చేసి, తరువాత మోల్డ్‌లలో పోసి పన్నీర్ ముక్కలలా కట్ చేసి మార్కెట్‌లోకి పంపిస్తారు. ఇలాంటి పన్నీర్ ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు దాడులు నిర్వహించి అనుమానాస్పద పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, డెయిరీ యూనిట్లలో నాణ్యత లేని లేదా కల్తీ పన్నీర్ వినియోగిస్తున్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు. ఈ నేపథ్యంలో అధికారులు వినియోగదారులు పన్నీర్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నాణ్యత లేని లేదా కల్తీ పన్నీర్ తినడం వల్ల కడుపులో సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సూరత్‌లో 1401 కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం - Tholi Paluku