Let's talk: editor@tmv.in
సూపర్ సిక్స్ లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలి: వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు

సూపర్ సిక్స్ లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలి: వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు

Gaddamidi Naveen
12 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దానిని పూర్తయినట్లుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కదానినైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని ప్రభుత్వం నిరూపించలేదని అన్నారు.

సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, వాటి అమలు స్థితి ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం అంశంపై స్పందించిన గొల్ల బాబురావు, ఇథనాల్ బ్లెండింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే వినియోగదారులకు స్వచ్ఛమైన పెట్రోల్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు తమ అవసరానికి అనుగుణంగా ఇంధనాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు.

అలాగే రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ కొనసాగుతోందన్న ఆరోపణలను ఆయన మరోసారి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందే ఐటీ, విద్యాశాఖ మంత్రి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ గురించి మాట్లాడారని, దేశ రాజ్యాంగం అమల్లో ఉండగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

సాయికృష్ణ లాకప్ మృతి ఘటనపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు వేగవంతమైన న్యాయం కనిపించడం లేదన్నారు. అమాయకులపై కేసులు నమోదు చేయడం, నిర్బంధాలు, యూఏపీఏ చట్టం దుర్వినియోగం వంటి ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విఫలమవుతోందని గొల్ల బాబురావు విమర్శించారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPPoliticsYSRCPChandrababuNaiduSuperSixGollaBabuRaoAPNewsPoliticalNewsAndhraPoliticsTeluguNewsAPGovernmentParliament
సూపర్ సిక్స్ లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలి: వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు - Tholi Paluku