Let's talk: editor@tmv.in
సుభాష్‌ చంద్ర దివాలా విషయంలో కేంద్రం స్పందించదా?: కేటీఆర్‌

సుభాష్‌ చంద్ర దివాలా విషయంలో కేంద్రం స్పందించదా?: కేటీఆర్‌

Pinjari Chand
29 ఆగస్టు, 2026

నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసుకు సంబంధించి వెలువడిన 99.97 శాతం ‘హెయిర్‌కట్‌’ నివేదికలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలను సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ.. సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు, ఈఎంఐలు చెల్లించే ఉద్యోగులు రుణాలు చెల్లించడంలో విఫలమైతే డిఫాల్టర్లు, ఎన్‌పీఏలుగా ముద్ర వేస్తారని అన్నారు. అయితే దేశంలోని ధనవంతులు, పలుకుబడి ఉన్నవారికి మాత్రం 99.97 శాతం మినహాయింపు లభిస్తోందని విమర్శించారు. ఇది న్యాయవ్యవస్థ వైఫల్యమే? దీనిపై ఎన్డీయే ప్రభుత్వ పెద్దల నుంచి ఏమైనా సమాధానం ఉందా? అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

రూ.22 వేల కోట్ల రుణాలపై స్పష్టత

సుభాష్‌ చంద్ర వ్యక్తిగత ఎస్టేట్‌ నుంచి సుమారు రూ.6.25 కోట్లు మాత్రమే రికవరీ చేయాలని ప్రతిపాదించగా, ఆయనపై ఉన్న క్లెయిమ్‌లు రూ.22,000 కోట్లకు పైగా ఉన్నట్లు వచ్చిన వార్తలతో 99.97 శాతం హెయిర్‌కట్‌ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.22,006 కోట్లు సుభాష్‌ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్న రుణం కాదని స్పష్టం చేశాయి. ఎస్సెల్‌/జీ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీలు తీసుకున్న రుణాలకు చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉండటంతో, ఆయనపై ఆ మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు నమోదయ్యాయని వివరించాయి. అంటే, ఈ దివాలా ప్రక్రియ రుణాలు తీసుకున్న కంపెనీలపై కాకుండా, వ్యక్తిగత హామీదారుడిగా సుభాష్‌ చంద్రపై కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కంపెనీలపై రుణబాధ్యత కొనసాగుతుంది

కాబట్టి రూ.22 వేల కోట్ల రుణాల్లో 99.97 శాతం నష్టం బ్యాంకులకు వచ్చిందని చెప్పడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. 99.97 శాతం తగ్గింపు అనేది సుభాష్‌ చంద్ర వ్యక్తిగత హామీదారుడిగా ఉన్న బాధ్యత నుంచి ఎంత మొత్తం రికవరీ చేయగలరనే అంశానికి మాత్రమే సంబంధించిందని తెలిపింది. అసలు రుణాలు తీసుకున్న ఎస్సెల్‌/జీ గ్రూప్‌ కంపెనీలు తమ బకాయిలకు ఇప్పటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

రూ.1,494 కోట్లు కంపెనీల నుంచి..

ప్రతిపాదిత చెల్లింపు ప్రణాళిక ప్రకారం ప్రధాన రుణగ్రహీత కంపెనీల నుంచి సుమారు రూ.1,494 కోట్లు, సుభాష్‌ చంద్ర వ్యక్తిగతంగా రూ.6.25 కోట్లు చెల్లించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఆయా కంపెనీలకు చెందిన సెక్యూరిటీలు, ఇతర అందుబాటులో ఉన్న ఆస్తులపై రుణదాతలు తమ రికవరీ చర్యలను కొనసాగించవచ్చని వెల్లడించాయి.

సుభాష్‌ చంద్ర దివాలా విషయంలో కేంద్రం స్పందించదా?: కేటీఆర్‌ - Tholi Paluku