
సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: కరుణాసాగర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది కరుణాసాగర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, ఈ ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డే కాంగ్రెస్ అభ్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడంపై కొండా కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఈ సందర్బంగా మీడియాతో కరుణాసాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పర్యాయపదంగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుగా తన పదవికి రాజీనామా చేసి, తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించుకుని వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. రూ.200 కోట్ల విలువైన భూమిని షెల్ కంపెనీ ద్వారా తన కుటుంబానికి అనుకూలంగా కేటాయించేలా ముఖ్యమంత్రి వ్యవహరించారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కరుణాసాగర్ పేర్కొన్నారు. ఇవి కేవలం రాజకీయ విభేదాలుగా కొట్టిపారేయలేమన్నారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ వర్గాల నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హమని చెప్పారు. స్వయంగా కేబినెట్ మంత్రి కుమార్తె ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడంతో వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు.
కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నోటీసులు
కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేసిన కొండా సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పందించారు. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పరకాల నియోజకవర్గం నుంచి అవసరమైతే తాను స్వతంత్ర అభ్యర్థిగా (ఇండిపెండెంట్‌గా) అయినా పోటీ చేస్తానని కొండా సుస్మిత స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులను తొక్కేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.
