Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
సిరిసిల్ల మెగా క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్ల మెగా క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

Gaddamidi Naveen
19 జనవరి, 2026

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణ నేతన్నలపై కేంద్రం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొత్తది కాదని, గత 12 ఏళ్లుగా దీనిపై నిరంతరంగా పోరాటం చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మంత్రిగా ఉన్నప్పటి నుంచి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతులు సమర్పించామని తెలిపారు. పదుల సమావేశాలు, డజన్ల కొద్దీ లేఖలు రాసినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక్క సానుకూల నిర్ణయం కూడా రాకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు.

అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ నుంచి ప్రస్తుత మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ కలిసి సిరిసిల్ల మెగా క్లస్టర్ కోసం ప్రతిపాదనలు అందజేశామని కేటీఆర్ పేర్కొన్నారు. సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధృవీకరించినప్పటికీ ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్న వివక్షా పూరిత నిర్ణయమని కేటీఆర్ విమర్శించారు.

సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ అని పేర్కొన్న కేటీఆర్, అక్కడ 30 వేలకుపైగా పవర్ లూమ్స్ ఉండి వేలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. సిరిసిల్లకంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు మెగా క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు సహా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేటీఆర్ వివరించారు. అయినా సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చెప్పకుండా ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచడం సిగ్గుచేటని అన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటూ నినాదాలు చేసే కేంద్రం, దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్లకు మద్దతు ఇవ్వకపోవడం బీజేపీ ప్రభుత్వ ద్వంద నీతిని బయటపెడుతోందని కేటీఆర్ విమర్శించారు. కనీసం ఈ కేంద్ర బడ్జెట్‌లో అయినా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించి నేతన్నలకు న్యాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల మెగా క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ - Tholi Paluku