
సిబ్బంది భద్రతే లక్ష్యం.. విద్యుత్ స్తంభం ఎక్కి పరిశీలించిన సీఎండీ
నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, స్వయంగా ఆచరించి చూపించడం అని టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ), ఐఏఎస్ అధికారి జితేష్ వి. పాటిల్ నిరూపించారు. ‘బస్తీ బాట’ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కారం గ్రామంలో క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించడానికి ఆయన ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేవలం సమీక్షా సమావేశాలకే పరిమితం కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి విద్యుత్ లైన్లు, స్తంభాలపై పనిచేసేటప్పుడు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను, వారు పాటిస్తున్న రక్షణ పద్ధతులను ఆయన ఆరా తీశారు.
ఈ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ధరించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు, రక్షణ పరికరాల వాడకం, ముందస్తు జాగ్రత్తలను ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రతి విధుల నిర్వహణలో సిబ్బంది భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎండీ స్పష్టం చేశారు. ఉద్యోగుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ప్రతి ఒక్కరూ కేటాయించిన భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సంస్థ నాయకత్వం తమ వెంట ఉందనే బలమైన సందేశాన్ని ఆయన ఈ చర్య ద్వారా అందించారు. స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్, నిజమైన నాయకత్వానికి, మానవీయ విలువలకు నిలువుటద్దంగా నిలిచారు.
