

సిద్దిపేట జిల్లాలో 50వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట జిల్లాలో స్థిరమైన, అధిక ఆదాయాన్నిచ్చే వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా.. ఆయిల్ పామ్ సాగును 50 వేల ఎకరాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 14 వేల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని, రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొని మొక్కలు నాటారు.
గ్రామాలకు రూ.10 లక్షల భారీ ప్రోత్సాహకం
ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించడానికి మంత్రులు కీలక ప్రకటన చేశారు. ఏ గ్రామంలోనైనా 100 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే ఆ గ్రామానికి రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనికి అదనంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా తన వంతుగా మరో రూ.5 లక్షలు ఇస్తానని డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రకటించడంతో, మొత్తంగా ఆయా గ్రామాలకు రూ.10 లక్షల భారీ ప్రోత్సాహకం అందనుంది.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో వంటనూనెలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో వంటనూనెల ధరలు పెరుగుతున్నాయని, దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆయిల్‌పామ్ సాగులో తొలి నాలుగేళ్లు రైతులు ఓపికగా ఉండాల్సి వచ్చినప్పటికీ, ఆ తర్వాత గణనీయమైన ఆదాయం లభిస్తుందని మంత్రి వివరించారు. ప్రారంభ నాలుగేళ్లలో రైతులకు ప్రభుత్వ సబ్సిడీలతో పాటు రైతు భరోసా పథకం ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. వరి పంటతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు తక్కువ నీరు అవసరమవుతుందని, హుస్నాబాద్ సమీపంలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండటం రైతులకు అదనపు ప్రయోజనంగా మారుతుందని పేర్కొన్నారు.
గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం అధికంగా వరి కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గోదాములు ధాన్యంతో నిండిపోయాయని, బియ్యం ఎగుమతులపై పరిమితులు, ఎఫ్‌సీఐ కొనుగోళ్లలో తగ్గుదల కారణంగా రైతులు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెన్నూరు ప్రాంత రైతులు కూడా ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడించిన మంత్రి, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న సంపత్ అనే రైతును మంత్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
