Let's talk: editor@tmv.in
సింగరేణి కార్మికుల కష్టాన్ని కమీషన్లతో దోచుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సింగరేణి కార్మికుల కష్టాన్ని కమీషన్లతో దోచుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Gaddamidi Naveen
14 జులై, 2026

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) నిధుల దుర్వినియోగం, యాజమాన్య నిర్లక్ష్యంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా 51:49 ఈక్విటీ వాటాతో నడుపుతున్న ఈ బొగ్గు మైనింగ్ కంపెనీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఎలా నష్టపరిచాయో ఆయన వివరించారు.

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించిన ‘సింగరేణి భరోసా యాత్ర’ బహిరంగ సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. సింగరేణి సంస్థను, ఇక్కడి కార్మికులను ఆదుకునేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేలం ప్రక్రియ లేకుండానే నేరుగా 'తాడిచర్ల-2' బొగ్గు బ్లాక్‌ను కేటాయించిందని వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం నేపథ్యంలో, అన్ని బొగ్గు బ్లాకులను కేవలం వేలం ద్వారానే పంపిణీ చేయాలంటూ 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇది మినహాయింపు అని ఆయన పేర్కొన్నారు. వేలం లేకుండా ఒక మైనింగ్ కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయించడం ఇదే తొలిసారి అని, ఈ కొత్త బ్లాక్ వల్ల రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సింగరేణి అనేక సమస్యలతో సతమతమవుతోందని, సంస్థ యొక్క ఉత్పత్తి, రాబడి, ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సజావుగా సాగాలంటే కొత్త బొగ్గు బ్లాకులు అవసరమని, అయితే ఈ నాటి దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మండిపడ్డారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి పలు ప్రభుత్వ రంగ మైనింగ్ కంపెనీలు కొత్త బ్లాకుల కోసం వేలంలో పాల్గొంటుంటే, అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన "అహంకారం" కారణంగా సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు, కేంద్ర చట్ట మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక అనుమతి పొంది, ప్రధాని నరేంద్ర మోడీ తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేందుకు అంగీకరించారని తెలిపారు.

సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ, కంపెనీ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వమైనా కమీషన్ల రూపంలో సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తూ.. గ్లోబల్ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పాల్గొన్న హైదరాబాద్ ఫుట్‌బాల్ మ్యాచ్ స్పాన్సర్‌షిప్ కోసం సింగరేణి నిధులను మళ్లించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి భరించలేదా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్‌కో) కు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన బకాయిలను చెల్లించకుండా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాల హయాం నుంచి పేరుకుపోయిన ఈ బకాయిలు ప్రస్తుతం రూ. 54,000 కోట్లకు చేరాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ, కోల్ ఇండియా వంటి సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేస్తుందని పేర్కొంటూ.. ఈ ప్రాంతంలో రైల్వేల అభివృద్ధికి, సింగరేణి ఎదుగుదలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు
SingareniSCCLKishanReddyTelanganaNewsCoalMiningCoalSectorSingareniCollieriesKothagudemTelanganaPoliticsBRSCongressCoalBlock