
సామాన్యుడిలా బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వే ట్రాఫిక్ పరిశీలన
కేబీఆర్ పార్కు పరిసరాల్లో నగర ట్రాఫిక్ పోలీసులు కొత్తగా అమలులోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితులను ఆయన పర్యవేక్షించారు.
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ సీపీ ట్రాఫిక్ సరళిని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని వెల్లడించారు. మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కోసం అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, తగినంత మంది సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని సీపీ కోరారు.
