
సహజ ప్రసవాలు పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి
రాష్ట్రంలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, సహజ ప్రసవాలను ప్రోత్సహించడానికి వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. దీనిలో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే 370 మంది గైనకాలజిస్టులకు 'అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ' (పరికరాల సాయంతో సహజ ప్రసవం)పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
వాక్యూం, ఫోర్సెప్స్‌తో ప్రసవాలపై మెలకువలు
ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ కార్యక్రమం 6 నెలలపాటు దశలవారీగా జరుగుతుంది. శిక్షణలో భాగంగా, వైద్యులు వాక్యూం ఎక్స్ట్రాక్షన్ (కప్పు లాంటి పరికరం), ఫోర్సెప్స్ (స్పూన్ లాంటి పరికరం) వంటి పరికరాల సహాయంతో సహజ ప్రసవాలను ఎలా సురక్షితంగా చేయవచ్చో నేర్చుకుంటారు. గుంటూరు, ఒంగోలు, విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి. ఈ పరికరాలను ఉపయోగించి ప్రసవాలు చేయడం సాధారణ ప్రక్రియే అయినప్పటికీ, సిజేరియన్ల ధోరణి పెరగడం, వైద్యుల్లో నిర్లిప్తత, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి సహకారం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పద్ధతులు తగ్గుతున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా వైద్యులను కార్యోన్ముఖులను చేసి తక్కువ సిబ్బంది ఉన్న ప్రాంతాల్లో కూడా మెరుగైన ప్రసూతి సేవలు అందించేలా చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
ప్రత్యామ్నాయ ప్రసవ పద్ధతులపై శిక్షణ
నిపుణులు ఈ శిక్షణలో ప్రత్యామ్నాయ సహజ ప్రసవ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పక్కకు పడుకుని, కూర్చొని లేదా నిల్చొని వంటి వివిధ భంగిమల్లో ప్రసవాలు జరిగేలా ఎలా చేయవచ్చో వివరిస్తారు. ఈ విధానాల వల్ల మహిళలకు ప్రసవ వేదన, సమయం తగ్గుతాయి.
నర్సుల శిక్షణతో తగ్గిన సిజేరియన్లు
సహజ ప్రసవాలు పెంచే ప్రయత్నంలో భాగంగా, స్టాఫ్ నర్సులకు ఇప్పటికే 18 నెలల ప్రత్యేక 'ప్రొఫెషనల్ మిడ్ వైఫరీ కోర్సు' నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 172 మంది స్టాఫ్ నర్సులు శిక్షణ పొందుతున్నారు. తొలి బ్యాచ్ కింద శిక్షణ పొందిన 60 మంది స్టాఫ్ నర్సులు పనిచేసే ఆసుపత్రుల్లో గతంతో పోలిస్తే సిజేరియన్లు 9 శాతం వరకు తగ్గాయని వీరపాండియన్ తెలిపారు. మరోవైపు ప్రసవ సమయంలో జరిగే పెర్నియల్ కోతల్లో 10 శాతం వరకు తగ్గాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు, పర్యవేక్షణను బెస్ట్ ప్రాక్టీసెస్ కింద నెదర్లాండ్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ మిడ్ వైవ్స్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు లభించడం విశేషం.
