


సహకార సమాఖ్యవాదంతోనే దేశాభివృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కేంద్ర-రాష్ట్రాల నడుమ, పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సదరన్ జోనల్ కౌన్సిల్ ఒక కీలకమైన వేదిక అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ (దక్షిణ మండలి) సమావేశంలో ఆయన తెలంగాణ తరఫున పాల్గొని రాష్ట్ర హక్కులు, విభజన సమస్యలు, నీటి వాటాలపై బలమైన వాదన వినిపించారు. ఈ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ప్రస్తావిస్తూ.. ఒక బలమైన నిర్మాణం ఏర్పడాలంటే ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, దేనికది తన బరువును మోయగలిగితే చాలని, భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే సూత్రంపై పనిచేయాలని వ్యాఖ్యానించారు. విభేదాలు వచ్చినప్పుడే సమాఖ్య వ్యవస్థ సత్తా బయటపడుతుందని, తెలంగాణ ఎప్పుడైనా చట్టబద్ధమైన, సమయపాలనతో కూడిన పరిష్కారాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు.
కృష్ణానది నీటి వాటాలు & ప్రాజెక్టులు
కృష్ణా నది నీటి కేటాయింపుల్లో తెలంగాణ ఎలాంటి ప్రత్యేక మినహాయింపులను కోరడం లేదని, చట్టబద్ధంగా రావాల్సిన న్యాయమైన వాటానంతటినీ కోరుతోందని తెలిపారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. మిగులు జలాలపై దిగువ పరివాహక ప్రాంతంగా తెలంగాణకు పూర్తి హక్కులు ఉన్నాయని, కృష్ణా జలాల వివాదం ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉందన్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పునరుద్ధరిస్తున్నామని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమస్యలు
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ IX పరిధిలోని 23 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనపై తెలంగాణ తన అభిప్రాయాలను కేంద్ర హోం శాఖకు ఇప్పటికే సమర్పించిందని ఆయన తెలిపారు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. షెడ్యూల్ X సంస్థల ఆస్తుల విభజనపై ఏపీ కోరుతున్న దావాలకు చట్టంలో మద్దతు లేదని, ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు.
32వ సదరన్ జోనల్ సమావేశానికి హైదరాబాద్ వేదిక
దక్షిణాది రాష్ట్రాలు పెట్టుబడులు, పరిశ్రమల కోసం పోటీ పడుతూనే, నీరు, విద్యుత్, పర్యావరణం వంటి సరిహద్దులు లేని సమస్యలపై కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. "దక్షిణ భారతదేశం కలిసి ఎదుగుతే.. భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది" అని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చాయని, అందుకే 32వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందంటూ భట్టి విక్రమార్క ఆహ్వానం పలికారు.
