
సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలపై కేంద్రం మౌనమెందుకు?: ఒవైసీ
అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారత సైన్యం గతంలో గస్తీ నిర్వహించిన ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇటీవల భారత సైనికుల గస్తీని అడ్డుకుందా? అక్కడ చైనా బలగాలు తమ ఉనికిని చాటుకునేలా చర్యలు చేపట్టాయా? అని ఆయన ప్రశ్నించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ఒవైసీ.. చైనా సరిహద్దు పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపిస్తూ గతంలో అడిగిన ప్రశ్నలను మరోసారి ప్రస్తావించారు. భారత సైన్యం గతంలో గస్తీ నిర్వహించిన ప్రాంతంలోకి వెళ్లకుండా పీఎల్ఏ ఇటీవల మన సైనికులను అడ్డుకుందా? అని ప్రశ్నించారు. భారత భూభాగంలో మన సైనికులు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాన్ని చైనా బలగాలు ధ్వంసం చేశాయా? అని కూడా అడిగారు. కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలు కూడా ఒవైసీ చేసిన తాజా ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
సున్నితమైన ప్రాంతం
భారత్-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులు ఇప్పటికీ సున్నితంగానే ఉన్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై చైనా హక్కులు కోరుతుండగా.. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 2020లో తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. పలు ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ.. ఇరు దేశాల మధ్య విస్తృత సరిహద్దు వివాదానికి ఇంకా పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు.
ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో గస్తీ విధానంలో మార్పులు, తాత్కాలిక నిర్మాణాలు లేదా గుడారాల ఏర్పాటుపై ఒవైసీ చేసిన ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే.. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో భద్రతాపరంగా ప్రాధాన్యమైన పరిణామంగా మారే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారి అనుసంధానం, భద్రతను బలోపేతం చేసేందుకు భారత్ చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు మరోసారి చైనా సరిహద్దు భద్రతపై చర్చకు దారితీశాయి.
