
సదరన్ జోనల్ కౌన్సిల్‌లో తెలంగాణ ప్రయోజనాలపై మంత్రి తుమ్మల విజ్ఞప్తులు
తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ (దక్షిణ మండలి) సమావేశం వేదికగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. రాష్ట్ర విభజనతో మిగిలిన సమస్యల పరిష్కారంతో పాటు అంతర్రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వేర్వేరుగా లేఖలు అందజేశారు. ఈ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి
భద్రాచలం పరిసరాల్లోని యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని తుమ్మల కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ గ్రామాలు ఏపీలోనే కొనసాగడంతో స్థానికులు పరిపాలనా సేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల కారణంగా వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల రవాణాలో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన భూములు పురుషోత్తపట్నంలో ఉండటంతో ఆలయ పరిపాలనలోనూ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకుని విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని అమిత్‌షాను, చంద్రబాబును కోరారు.
పెద్దవాగు పునరుద్ధరణకు ఏపీ వాటా నిధులు
2024 జూలైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, 13,640 ఎకరాల ఆయకట్టు ఏపీలో ఉందన్నారు. శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అవసరమని, 85.25 శాతం ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిష్పత్తి ప్రకారం నిధులు సమకూర్చాలని చంద్రబాబును కోరారు.
ఆయిల్‌పామ్ గెలలకు రూ.25 వేల ధర
ఆయిల్‌పామ్ రైతుల ఆదాయ భద్రత కోసం గెలల టన్నుకు కనీస హామీ ధర రూ.25 వేలు నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును తుమ్మల కోరారు. అంతర్జాతీయ పామాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం రైతుల ఆదాయంపై పడుతున్న నేపథ్యంలో, సాగు వ్యయానికి అనుసంధానమైన కాలానుగుణ ధర సవరణ విధానాన్ని కూడా అమలు చేయాలని సూచించారు.
భద్రాచలం–ఏలూరు రహదారికి జాతీయ హోదా
భద్రాచలం నుంచి దమ్మపేట, చింతలపూడి మీదుగా ఏలూరు వరకు ఉన్న సుమారు 160–165 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరారు. ఈ మార్గం మారుమూల, గిరిజన ప్రాంతాలను మార్కెట్లు, వైద్యం, విద్య, ఉపాధి కేంద్రాలతో అనుసంధానిస్తుందని తెలిపారు. భద్రాచలం వద్ద ఎన్ హెచ్-30, ఏలూరు వద్ద ఎన్ హెచ్-16ను అనుసంధానించే ఈ రహదారికి జాతీయ హోదా లభిస్తే రెండు రాష్ట్రాల మధ్య రవాణా, ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
