
సంవత్సరంలోపు టోల్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తాం: నితిన్ గడ్కరీ
దేశంలో హైవేలపై టోల్ వసూళ్ల విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుత టోల్ బూత్ వ్యవస్థ ఒక సంవత్సరంలోపు పూర్తిగా ముగుస్తుందని, దాని స్థానంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ అమలు కానుందని ప్రకటించారు.
టోల్ పేరుతో ఎవరూ మిమ్మల్ని ఆపరు. ఎటువంటి అడ్డంకులు లేకుండా, టోల్ కలెక్షన్ కోసం దేశవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థ అమలు చేస్తాం” అని తెలిపారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. త్వరలోనే అన్ని జాతీయ రహదారులపై విస్తరిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ. 10 లక్షల కోట్ల విలువైన 4,500 జాతీయ రహదారి ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని కూడా సభను ఆయనకు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులకు ఎటువంటి ఆలస్యం కలగకుండా సాఫీగా ప్రయాణించేలా చేయడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. దీనికి ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్’ (బారియర్-లెస్ టోలింగ్) అని పేరు. ఈ వ్యవస్థలో రెండు కీలక సాంకేతికతలు ఉంటాయి. అందులో ఫాస్టాగ్ (వాహనం గాజుపై అమర్చే పరికరం ద్వారా, RFID ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి.
ఈ రెండూ కలిసి పనిచేస్తే వాహనం టోల్ ప్లాజా దగ్గర ఆగకుండానే టోల్ మొత్తం అటోమేటిక్ గా కట్ అవుతుంది. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద బారియర్లు, క్యూలు పూర్తిగా కనుమరుగవుతాయి. ఇందుకోసం ఎంపిక చేసిన టోల్ ప్లాజాల్లో టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. ప్రయోగాత్మక ఫలితాలు సానుకూలంగా ఉంటే, దశలవారీగా దేశమంతా ఈ వ్యవస్థను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. వాహనదారులకు ఇకపై రహదారులపై సాఫీగా, ఆలస్యం లేకుండా ప్రయాణించే రోజులు సమీపిస్తున్నాయని తెలిపారు.
2030 నాటికి భారత్‌లో ఈవీ మార్కెట్ విలువ రూ 20 లక్షల కోట్లకు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, 2030 నాటికి దీని మొత్తం విలువ రూ 20 లక్షల కోట్ల (రూ.20 లక్షల కోట్లు) వరకు చేరే అవకాశముందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తద్వారా దాదాపు 5 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ పి.సి. మోడీ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ ఆయన ప్రస్తుతం దేశంలో 57 లక్షల ఈవీలు రిజిస్ట్రేషన్ కాగా, 2024–25లో అమ్మకాల వృద్ధి వేగంగా ఉన్నదని వెల్లడించారు. ఈవీ రంగంలో ఇప్పటికే 400కు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, వార్షిక వాహన అమ్మకాలు ఒక కోటి యూనిట్లు చేరే అవకాశముందని చెప్పారు. లిథియం అయాన్ బ్యాటరీ ధరలు ముందెన్నడూ లేనివిధంగా తగ్గాయని గడ్కరీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో ఉన్న 60 లక్షల టన్నుల లిథియం నిల్వలు దేశానికి వన్ బిగ్ అడ్వాంటేజ్ అవుతాయని తెలిపారు. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో 6శాతం అని వివరించారు. బ్యాటరీల రంగంలో సోడియం-అయాన్, అల్యూమినియం-అయాన్, జింక్-అయాన్ వంటి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
భవిష్యత్తు ఇంధనం — హైడ్రోజన్
భారత్‌కు భారీగా పెరుగుతున్న ఫాసిల్ ఇంధన దిగుమతులు (రూ.22 లక్షల కోట్లు) కాలుష్యానికి కారణమవుతున్నాయని, అందుకే బయోఫ్యూయల్స్, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఈ రోజు మనం ఎనర్జీ దిగుమతి దారులమైతే, భవిష్యత్తులో ఎగుమతిదారులుగా మారుతామని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
