Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
షేక్ హసీనా కుమారుడిపై బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ

షేక్ హసీనా కుమారుడిపై బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ

Shaik Mohammad Shaffee
4 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్‌పై బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రైబ్యునల్ గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యుమానిటీ (మానవాళికి వ్యతిరేకంగా నేరాలు) ఆరోపణలపై మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష విధించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

గతేడాది జూలై తిరుగుబాటు సమయంలో మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణలపై జాయ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇదే తరహా వారెంట్‌ను అప్పటి ఐసీటీ వ్యవహారాల సహాయ మంత్రి జునాయిద్ అహ్మద్ పలాక్‌పైనా జారీ చేశారు. అయితే పలాక్ ఇప్పటికే జైలులో ఉన్నారు.

2024 జూలైలో విద్యార్థులు చేపట్టిన హింసాత్మక నిరసనను అణచివేయడానికి మాజీ ప్రధాని షేక్ హసీనా తన అధికార బలగాన్ని ఉపయోగించి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం (వారి గైర్హాజరీలో), బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మాజీ ప్రధాని హసీనా, అప్పటి హోంమంత్రి అసదుజ్జామాన్ ఖాన్ కమల్‌కు మరణశిక్ష విధించింది. షేక్ హసీనా కుమారుడైన 54 ఏళ్ల జాయ్ ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ నిపుణుడు. ఆయన మాజీ ప్రధానికి ఐసీటీ వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు.

విద్యార్థుల నేతృత్వంలోని ఈ ఉద్యమం ఆగస్టు 5, 2024న మాజీ ప్రధాని హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఉద్యమంలో చనిపోయిన 834 మందిని 'జూలై యోధులు'గా పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జూలై 15 నుండి ఆగస్టు 15 మధ్య సుమారు 1,400 మంది చనిపోయినట్లు నివేదించింది.

ఈ ఉద్యమం సందర్భంగా కర్ఫ్యూ విధించిన తర్వాత జరిగిన 'సామూహిక హత్యలు' అనే మరో కేసులో మాజీ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని పెట్టుబడుల సలహాదారు సల్మాన్ ఎఫ్. రెహమాన్‌లపై ట్రైబ్యునల్ గురువారం అధికారిక అభియోగాలను అంగీకరించింది. వీరిద్దరూ కూడా ఇప్పటికే జైలులో ఉన్నారు. ట్రైబ్యునల్ వీరిని డిసెంబర్ 10న కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.

షేక్ హసీనా కుమారుడిపై బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ - Tholi Paluku