Let's talk: editor@tmv.in
విశాఖలో సెప్టెంబర్ 10 నుంచి 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు

విశాఖలో సెప్టెంబర్ 10 నుంచి 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు స్థానిక పర్యాటక భాగస్వాములకు విస్తృత వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

విశాఖపట్నం వేదికగా సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు 41వ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఐఏటీఓ) జాతీయ వార్షిక సదస్సు జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ టూర్‌ ఆపరేటర్లు, హోటల్‌ నిర్వాహకులు, ట్రావెల్‌ సంస్థలు, విమానయాన రంగ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపైకి రానున్న ఈ సదస్సు రాష్ట్ర పర్యాటక రంగానికి కీలక అవకాశమని పేర్కొన్నారు.

ఇన్‌బౌండ్‌ టూరిజంలో దేశంలో అగ్రగామిగా ఉన్న ఐఏటీఓకు 2,068 మందికి పైగా సభ్యులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఏపీకి చెందిన పర్యాటక భాగస్వాములను ఐఏటీఓలోకి ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన టూర్‌ ఆపరేటర్లు, హోటళ్లు, ఇతర పర్యాటక భాగస్వాములు చెల్లించాల్సిన రూ.10,000తో పాటు జీఎస్టీ వన్‌టైమ్‌ అడ్మిషన్‌ ఫీజును పూర్తిగా మినహాయించినట్లు వెల్లడించారు. ఈ అవకాశం 2026 డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకునేవారికి వర్తిస్తుందని తెలిపారు.

అదేవిధంగా సదస్సు రిజిస్ట్రేషన్‌ ఫీజును ఏపీ ప్రతినిధులకు రూ.8,500 నుంచి రూ.3,000కు తగ్గించినట్లు మంత్రి చెప్పారు. అర్హులైన వారు ఎలాంటి ప్రాథమిక ప్రవేశ రుసుము లేకుండా ఐఏటీఓ అధికారిక పోర్టల్‌ https://iato.in/Register/form ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ఏపీ హోటళ్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాలకు జాతీయ స్థాయిలో ప్రచారం లభించడంతో పాటు ప్రముఖ టూర్‌ ఆపరేటర్లతో నేరుగా వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉంటుందని దుర్గేష్‌ తెలిపారు. హోటళ్లు, రిసార్టులు, టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెన్సీలు, హోమ్‌స్టే నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లు, టూరిస్ట్‌ గైడ్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

విశాఖలో సెప్టెంబర్ 10 నుంచి 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు - Tholi Paluku