
విశాఖలో భూప్రకంపనలు.. పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావంతో విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో సాగర్‌నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 5:05:46 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం బంగాళాఖాతంలో, కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు ఉద్భవించినట్లు పేర్కొన్నారు. భూకంపం కారణంగా విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వల్పంగా ప్రకంపనలను అనుభవించినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేదా ఇతర నష్టాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు నెలకొనలేదని, పరిస్థితి పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
