
విశాఖలో నేడు వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (మంగళవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు ఆయన స్వయంగా వెళ్లనున్నారు. ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి, వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతారు. తర్వాత ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నాయకులను ఇప్పటికే ఆదేశించిన జగన్, ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా విశాఖకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
