
విశాఖ బోటు ప్రమాద బాధితులకు రూ.49 లక్షల చెక్కులు అందజేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పార్టీ నేతలు ఆదివారం అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున, ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కారి చిన్నాకు కూడా రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.49 లక్షల విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు.
విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాల రోడ్డులోని జబ్బార్ తోట జంక్షన్ సమీపంలో బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బొడ్డుకొండ అప్పలనాయుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు. దాదాపు 18 గంటల ఆలస్యం కారణంగానే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని విమర్శించారు. ఘటన జరిగి 15 రోజులు గడిచినా కూటమి ప్రభుత్వం, సంబంధిత అధికారులు, స్థానిక మంత్రులు బాధిత కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకునే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
బోటు ప్రమాదం అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని, అదే హామీ మేరకు పార్టీ సొంత నిధులతో రూ.49 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ, ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫిషరీస్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఉంటే ప్రాణనష్టం నివారించే అవకాశం ఉండేదన్నారు. బాధితులను పరామర్శించాల్సిన మంత్రులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం, కొత్త బోటు అందిస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు.
విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో ప్రభుత్వం, మెరైన్ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం అందే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
