Let's talk: editor@tmv.in
విశాఖ ప‌డ‌వ‌ ప్రమాదం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: వైఎస్ జగన్
విశాఖ ప‌డ‌వ‌ ప్రమాదం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: వైఎస్ జగన్
విశాఖ ప‌డ‌వ‌ ప్రమాదం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: వైఎస్ జగన్

విశాఖ ప‌డ‌వ‌ ప్రమాదం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: వైఎస్ జగన్

Gaddamidi Naveen
15 జులై, 2026

విశాఖపట్నం తీరంలో జరిగిన మత్స్యకారుల ప‌డ‌వ‌ ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దారుణ ఘటన ప్రభుత్వ పరిపాలనా నిర్లక్ష్యం వల్ల జరిగిన అమానుషమైన ఉదంతం అని ఆయన అభివర్ణించారు. విశాఖపట్నం జబ్బర్ తోటలో బోటు ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను, అలాగే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాల ఆవేదనను ఓర్పుగా విన్న ఆయన, వారిని ఓదార్చుతూ ధైర్యం చెప్పారు.అనంతరం ప్రభుత్వ ఆలస్యపు సహాయక చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అత్యంత అమానుషమైనది. ఆరు మత్స్యకార కుటుంబాలు తమ వారిని కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారు సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు పదేపదే సందేశాలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ విషయాన్ని పరిశీలించడానికే అధికారులకు గంటల కొద్దీ సమయం పట్టిందంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు.

ఈ ప్రమాదం ప్రధాన నౌకాదళ, పరిపాలనా కేంద్రాలకు అత్యంత సమీపంలో జరిగినప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నానికి, గంగవరం పోర్టుకు కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. వైజాగ్‌లో కోస్ట్ గార్డ్, నేవీ, కలెక్టర్, కమిషనర్.. ఇలా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడే ఉంది. పైగా తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయం కూడా విశాఖలోనే ఉంది. ఇంత ఉన్నా ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే ఆరు కుటుంబాల మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని జగన్ ఆరోపించారు.

కూటమి ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని, బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించేందుకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ ప్రతినిధి రాలేదని జగన్ విమర్శించారు. ప్రమాదం జరిగిన రోజు మాత్రమే కాదు, మరుసటి రోజు కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. చివరకు ఆరుగురు మరణించడానికి ప్రభుత్వ అలసత్వమే కారణమైందని, అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఇంతవరకు ఒక్క మంత్రి కూడా వీరి ఇళ్లకు వచ్చి కనీసం ఓదార్చలేదన్నారు. ఇది అత్యంత విచారకరం, అమానుషం అని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకార కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఐదు లక్షలుగా ఉన్న మత్స్యకారుల ప్రమాద బీమాను పది లక్షలకు పెంచింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం సాయం చేయకపోయినా, త్వరలోనే రాబోయే తమ ప్రభుత్వంలో బాధితులకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

బోటు ప్రమాద బాధితులకు రూ.49 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

ఈ సందర్భంగా విశాఖ బోటు ప్రమాదంలో బాధిత‌ ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన కారి చిన్నాకు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.49 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని జగన్ ప్రకటించారు. గతంలో మన మత్స్యకారులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చెరలో చిక్కినప్పుడు కేంద్రంతో దౌత్యం జరిపి విడిపించామ‌ని తెలిపారు. ఉపాధి కోసం వలస వెళ్లకుండా రాష్ట్రంలోనే 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. మన ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే వేలాది మంది మత్స్యకారులు సొంత బోట్లకు యజమానులయ్యేవారని జ‌గ‌న్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
YSJaganJaganMohanReddyYSRCPVisakhapatnamVizagBoatTragedyBoatAccidentFishermenLivesMatterFishermenFamiliesAndhraPradeshVizagNewsAPPolitics