Let's talk: editor@tmv.in
విశాఖ తీరంలో మత్స్యకారుడు గల్లంతు

విశాఖ తీరంలో మత్స్యకారుడు గల్లంతు

Pinjari Chand
21 ఆగస్టు, 2026

విశాఖపట్నం తీరానికి సమీపంలో పడవ నుంచి సముద్రంలో పడిపోయిన 50 ఏళ్ల మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అప్పన్న అనే మత్స్యకారుడు గురువారం తెల్లవారుజామున సముద్రంలో పడిపోయినట్లు మెరైన్‌ పోలీసులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. అప్పన్న మరో ఏడుగురు మత్స్యకారులతో కలిసి ఆగస్టు 16న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో తిరిగి వస్తుండగా చేపలను నిల్వ చేసేందుకు ఉపయోగించే ఉప్పు తీసుకునేందుకు పడవ వెనుక భాగానికి వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా సముద్రంలో ఏదో పడిన శబ్దం వినిపించింది. వెంటనే మిగతా మత్స్యకారులు అక్కడికి వెళ్లి చూడగా అప్పన్న కనిపించలేదు. విశాఖ తీరానికి సుమారు 11 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పడవ యజమాని సోదరుడు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోస్ట్‌గార్డ్‌, నేవీ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అప్పన్న ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆయన జాడ లభించలేదు. మిగిలిన మత్స్యకారులు కూడా సముద్రంలోనే ఉండి అధికారుల గాలింపు చర్యలకు సహకరిస్తున్నారు.

గాలింపు ముమ్మరం చేయండి: హోంమంత్రి ఆదేశం

అప్పన్నను సురక్షితంగా గుర్తించేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర హోంమంత్రి వి.అనిత ఆదేశించారు. మత్స్యశాఖ, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ అధికారులు సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాలని సూచించారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి.. మిగతా మత్స్యకారుల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి అప్పన్నను గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. బాధిత మత్స్యకారుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

విశాఖ తీరంలో మత్స్యకారుడు గల్లంతు - Tholi Paluku