
విద్యార్థుల ఫీజు బకాయిలపై రాహుల్ జోక్యం చేసుకోవాలి: రామచందర్‌రావు బహిరంగ లేఖ
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు కోరారు. ఈ మేరకు ఇటాలియన్‌లో రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని విద్యార్థుల ఆవేదన, ఆందోళనల ప్రతిధ్వని రాహుల్ గాంధీకి చేరడం లేదని ఆయన విమర్శించారు.
ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. నిరాహార దీక్షలు, నిరసనలు, లాఠీఛార్జీలు, అరెస్టులు, ముఖ్యమంత్రికి విద్యార్థులు రాసిన లేఖలు.. ఇవేవీ తెలంగాణ విద్యార్థుల గొంతును రాహుల్ గాంధీకి లేదా ఆయన అహంకార కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించేలా చేయలేకపోయాయి. అందుకే రాహుల్ గాంధీకి ఆయన మాతృభాషలోనే లేఖ రాయాలని నిర్ణయించుకున్నాను అని రామచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను సందర్శించినప్పుడు విద్యార్థుల నుండి ఒకే ప్రశ్న పదేపదే ఎదురవుతోందని, తమ గోడు రాహుల్ గాంధీకి ఎందుకు వినబడటం లేదు? అని వారు ప్రశ్నిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
విద్యార్థుల భవిష్యత్తు అంధకారం
రాష్ట్రంలో సుమారు రూ.15,వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వారు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు సాధించలేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు నడపడం కష్టంగా మారిందని, అనేక మంది కళాశాల సిబ్బంది సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు.
అణచివేత చర్యలు, కాంగ్రెస్ హామీలు
విద్యార్థుల తరఫున నిరసనలు తెలిపేందుకు బీజేపీ ప్రయత్నించిన ప్రతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు కేసులు, లాఠీఛార్జీలు, ముందస్తు అరెస్టులతో అణచివేసేందుకు యత్నించిందని రామచందర్‌రావు ఆరోపించారు. తాను నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధపడితే వేదికకు అనుమతి నిరాకరించారని, దాంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దీక్ష చేయాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల కోసం గొంతు విప్పినందుకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే తనను నాలుగు సార్లు అరెస్టు చేశారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని, కానీ ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం శాంతియుత నిరసనలకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, 'విద్య భరోసా కార్డులు' వంటి ఎన్నికల హామీలు అమలు కాలేదని గుర్తుచేశారు.
కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రమే కాకుండా, పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనను నిరసిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు, గత దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు కోసం ఆయుష్ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని రామచందర్‌రావు లేఖలో ప్రస్తావించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తక్షణ పరిష్కారాలు కోరుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్ల సమయం అడగడం విడ్డూరంగా ఉందన్నారు. యువత సంరక్షకుడిగా కొత్త అవతారం ఎత్తిన రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ జవాబుదారీతనాన్ని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయించాలని కోరారు.
కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ పై వస్తున్న విమర్శలపై ఆగస్టు 14న స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తామని, కళాశాలలు సర్టిఫికేట్లు నిలిపివేయకుండా ఈ కొత్త విధానాన్ని తెచ్చామని వివరించిన సంగతి తెలిసిందే.
