Let's talk: editor@tmv.in
వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Gaddamidi Naveen
19 జులై, 2026

వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో రూ.290 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ, బలోపేత పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కందనెల్లి జేపీఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మెరుగైన రహదారులు పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయని పేర్కొన్నారు. ప్రజాపాలనలో భాగంగా గత 30 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే భారీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం యంగ్ ఇండియా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోర్టు కేసు పరిష్కారమైన వెంటనే రూ.94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 18 వారాల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రూ. 261 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని, కాగ్నా నదిలో మురుగునీరు కలవకుండా రూ. 30 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులకు పారదర్శకంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించామన్నారు.

నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధుల హర్షం

శాసనమండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కర్ణాటక సరిహద్దు రోడ్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమం కోసం రూ. 75 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశామని, బషీరాబాద్‌లో 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాల మంజూరయ్యాయని తెలిపారు.

ట్యాగ్‌లు
VikarabadRoadDevelopmentTelanganaDevelopmentKomatireddyVenkatReddySridharBabuInfrastructureRoadWorks