
‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’కేటగిరీలోని ఓటర్ల పేర్లు బహిరంగంగా ప్రదర్శించాలి: సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ కేటగిరీలోకి వచ్చిన ఓటర్ల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కు సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో విధివిధానాల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది.
‘ లాజికల్ డిస్క్రెపెన్సీలు’పై కోర్టు ఆందోళన
‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ కేటగిరీలో ఉన్న కొందరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఈసీఐ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో, ప్రభావిత ఓటర్లు తమ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ భవనాలు, బ్లాక్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో అలాంటి ఓటర్ల పేర్లను ప్రదర్శించాలని కోర్టు ఆదేశించింది.
అభ్యంతరాలు, పత్రాలు సమర్పించేందుకు అవకాశం
ప్రభావితులయ్యే వ్యక్తులు తమ పత్రాలు, అభ్యంతరాలను సంబంధిత అధికారుల ముందు సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన అధికార పత్రం (ఆథరైజేషన్ లెటర్) జారీ చేయాలని ఆదేశించింది. ఇంకా అభ్యంతరాలు లేదా క్లెయిమ్స్ దాఖలు చేయని వారు 10 రోజులలోపు అవి సమర్పించాలని ధర్మాసనం సూచించింది.
ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు
ఈసీఐ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సరిపడా సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రక్రియ సజావుగా సాగేందుకు పశ్చిమ బెంగాల్ డీజీపీ చట్ట సువ్యవస్థ పర్యవేక్షించాలని తెలిపింది. అభ్యంతరాలు సరైనవిగా తేలితే, ఈసీఐ నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం ప్రభావితులకు వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టు పేర్కొంది. అవసరమైతే అభ్యంతరం సమర్పించే సమయంలోనే విచారణ జరపవచ్చని తెలిపింది.
1.2 కోట్లకు పైగా పేర్లపై ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’
ఈసీఐ నిర్వహించే ERONET పోర్టల్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో 1.2 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ కేటగిరీలో గుర్తించటం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.
మమతా బెనర్జీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ నేత మమతా బెనర్జీ ఈ కేటగిరీని అనుమానాస్పదమైనదిగా అభివర్ణించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈసీఐ పని చేస్తోందని ఆరోపించిన ఆమె, ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 58 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని, ఆ తర్వాత మరో 1.36 కోట్ల మందిని విచారణలకు గురిచేసేందుకు ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ అనే కొత్త కేటగిరీని సృష్టించారని ఆరోపించారు.
ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు చారిత్రాత్మకం:అభిషేక్ బెనర్జీ
భారత ఎన్నికల కమిషన్‌కు (ఈసీఐ) సుప్రీంకోర్టు జారీ చేసిన చారిత్రాత్మక ఆదేశాలను మేము పూర్తి హృదయంతో స్వాగతిస్తున్నాం. ఈ అత్యవసర జోక్యం ద్వారా క్రూరమైన, రాజకీయ ప్రేరితమైన, తీవ్ర అన్యాయంతో నిండిన ఎస్ఐఆర్ ప్రక్రియకు గట్టి దెబ్బ పడిందని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయంతో బీజేపీ–ఈసీఐ కలయిక బెంగాల్ వ్యతిరేక జమీందారులుగా బహిర్గత మైంది. ఇది ఎన్నికల కమిషన్ ముఖంపై న్యాయస్థానం కొట్టిన చెంపదెబ్బ అని వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజలు మాత్రం దీనికంటే ఇంకా ఘాటైన ప్రజాస్వామ్య దెబ్బను బ్యాలెట్ బాక్స్ వద్ద బీజేపీకి ఇవ్వబోతున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
అమర్త్య సేన్ పేరు కూడా జాబితాలో
నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ పేరు కూడా ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’గా గుర్తించారు. ఆయన వయస్సు, ఆయన తల్లి అమితా సేన్ వయస్సు మధ్య తేడా 15 ఏళ్లలోపుగా చూపటమే కారణమని పశ్చిమ బెంగాల్ సీఈఓ వెల్లడించారు.
గడువు
క్లెయిమ్స్, అభ్యంతరాల గడువు: జనవరి 19, 2026 వరకు
విచారణలు: ఫిబ్రవరి 7, 2026 వరకు
తుది ఓటర్ల జాబితా విడుదల: ఫిబ్రవరి 14, 2026
‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ అంటే
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ అనేవి ఓటరు వివరాల్లో కంప్యూటర్ సిస్టమ్ గుర్తించే పొంతనలేని వివరాలు.వయస్సు–తల్లిదండ్రుల వయస్సు మధ్య అసాధారణ తేడాలు, ఒకే వ్యక్తి రెండు చోట్ల నమోదు కావడం, లింగం–సంబంధ వివరాల్లో పొంతన లేకపోవడం, మరణించిన వ్యక్తుల పేర్లు జాబితాలో ఉండటం వంటి అంశాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇవి తప్పులేనని తేల్చే ముందు, ప్రభావిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి పత్రాలు సమర్పించుకునే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.
