
రోహింగ్యాల ఓట్ల తొలగింపుపై ఈఆర్‌ఓలకు ప్రత్యేక ఆదేశాలు: సీఈఓ సుదర్శన్ రెడ్డి
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో భాగంగా.. రోహింగ్యాలుగా అనుమానిస్తున్న వారి విషయంలో ఓటరు నమోదు అధికారులైన (ఈఆర్‌ఓలు) నోటీసు కాలంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న రోహింగ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న పలువురు రోహింగ్యాలు నకిలీ ఆధారాలు, ఇతర గుర్తింపు పత్రాలను కలిగి ఉన్నట్లు తేలిందని, మరి వారిని ఓటర్ల జాబితా నుంచి ఎలా గుర్తిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఈఓ సమాధానమిచ్చారు.
2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం
రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధానంగా ప్రస్తుత ఓటర్లను 2002 నాటి ఓటర్ల జాబితాతో లింక్ చేస్తుంది. రోహింగ్యాల వంటి వలసదారులకు 2002 నాటి ఓటరు స్థితికి సంబంధించిన వివరాలు ఉండే అవకాశం లేదు. అందువల్ల వారు ఎన్యూమరేషన్ ఫారమ్‌లలో అన్ని వివరాలను పూర్తిగా పూరించలేరని, అలాంటి వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. పాక్షిక న్యాయాధికారాలు కలిగి ఉండే ఈఆర్‌ఓలకు నోటీసు కాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తాము. ఫలానా ప్రాంతాల్లో రోహింగ్యాల ఉనికి ఉన్నట్లు గుర్తించామని, నిర్దేశిత పాకెట్స్ (ప్రాంతాల) నుంచి వచ్చే ఫారమ్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తాం. నోటీసు పీరియడ్‌లోనే వీరిని పూర్తిగా ఫిల్టర్ చేసి తొలగిస్తాం అని సీఈఓ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 99 శాతం మేర ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ పూర్తయిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. నింపిన ఫారమ్‌లలో ఇప్పటివరకు 27 శాతం (సుమారు 85 లక్షలు) తిరిగి అందాయని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో నింపిన ఫారమ్‌లను సేకరించడంపైనే పూర్తి దృష్టి పెడతామని, జూలై 24తో ఈ ఫారమ్‌ల సేకరణ ముగుస్తుందని స్పష్టం చేశారు. జూన్ 25న ప్రారంభమైన ఈ ఇంటింటి గుర్తింపు ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగుతుందన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇళ్లకు రావడం లేదనే ఫిర్యాదులపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంటింటికీ వెళ్లాల్సిందేనని, వీలుకాని చోట హెల్పర్లను తీసుకోవాలని ఆదేశించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే బీఎల్ఓలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేర్లు తప్పుగా పడటం వంటి సాంకేతిక లోపాల వల్ల ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదని, ఆగస్టు నెలలో ఇలాంటి లోపాలపై నోటీసులు జారీ చేసి, ఓటర్ల నుంచి సమాధానాలు స్వీకరించి అర్హులైన వారెవ్వరూ ఓటు కోల్పోకుండా ఈఆర్‌ఓలు చర్యలు తీసుకుంటారని సీఈఓ సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
