
రోయింగ్‌లో మెరిసిన భారత్.. 10 పతకాలు సొంతం
భారత రోయింగ్ క్రీడాకారులు 2025 ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. పారిస్ ఒలింపియన్ బల్‌రాజ్ పన్వర్ సారథ్యంలో భారత్ మొత్తం 10 పతకాలను సాధించింది. వీటిలో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
3 స్వర్ణాలతో మెరిసిన భారత్
ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడు స్వర్ణ పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో మెరిసింది. పారిస్ ఒలింపియన్ అయిన బల్‌రాజ్ పన్వర్ పురుషుల సింగిల్ స్కల్ ఈవెంట్‌లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. లైట్‌వెయిట్ పురుషుల డబుల్ స్కల్ ఈవెంట్‌లో లక్షయ్-అజయ్ త్యాగి జంట అద్భుతమైన సమన్వయాన్ని, ఓర్పును ప్రదర్శించి స్వర్ణం సాధించింది. అలాగే పురుషుల క్వాడ్రపుల్ స్కల్ ఈవెంట్‌లో కుల్విందర్ సింగ్, నవదీప్ సింగ్, సత్నం సింగ్, జకర్ ఖాన్ బృందం పర్ఫెక్ట్ కోఆర్డినేషన్‌తో రోయింగ్ చేసి అగ్రస్థానంలో నిలిచి మరో స్వర్ణాన్ని గెలుచుకుంది.
మహిళల రోయింగ్‌లో చారిత్రక రజతం
ఈ టోర్నమెంట్‌లో అత్యంత ముఖ్యమైన ఘట్టం భారత మహిళల విభాగంలో నమోదైంది. గుర్బానీ కౌర్, దిల్‌జోత్ కౌర్‌ల జంట లైట్‌వెయిట్ మహిళల పెయిర్ ఈవెంట్‌లో రజత పతకం గెలిచి, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో భారత మహిళలకు గత 15 ఏళ్లుగా ఉన్న పతకాల కరువును తీర్చారు. వారి సాంకేతిక నైపుణ్యం, పోరాట పటిమ భారతీయ మహిళల రోయింగ్‌కు ఒక చారిత్రక మలుపుగా పరిగణించబడుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం ఐదు రజతాలు, రెండు కాంస్యాలను కూడా సాధించింది.
రజత పతకాలు: పురుషుల ఎయిట్ ఈవెంట్‌లో నితిన్ డియోల్, పర్విందర్ సింగ్, లఖ్వీర్ సింగ్, రవి, గుర్‌ప్రతాప్ సింగ్, భీమ్ సింగ్, జస్విందర్ సింగ్, కుల్బీర్, కిరణ్ సింగ్ మైయోమ్‌లతో కూడిన జట్టు గట్టి పోటీని ఎదుర్కొని రజతం సాధించింది. అలాగే పురుషుల డబుల్ స్కల్ ఈవెంట్‌లో జస్‌పిందర్ సింగ్-సల్మాన్ ఖాన్ రజతాన్ని దక్కించుకున్నారు. రోహిత్, ఉజ్వల్ కుమార్ సింగ్, లక్షయ్, అజయ్ త్యాగిల బృందం లైట్‌వెయిట్ పురుషుల క్వాడ్రపుల్ స్కల్ ఈవెంట్‌లో, అలాగే సన్ని కుమార్, ఇక్బాల్ సింగ్, బాబు లాల్ యాదవ్, యోగేష్ కుమార్‌ల జట్టు లైట్‌వెయిట్ పురుషుల ఫోర్ ఈవెంట్ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని గెలుచుకున్నారు.
కాంస్య పతకాలు: లైట్‌వెయిట్ పురుషుల పెయిర్ ఈవెంట్‌ల నితిన్ డియోల్- పర్విందర్ సింగ్‌ల జంట తమ అద్భుత ప్రదర్శనతో కాంస్యం గెలిచారు. మహిళల ఎయిట్ ఈవెంట్‌లో గుర్బానీ కౌర్, దిల్‌జోత్ కౌర్, సుమన్ దేవి, అలెన్నా అంటో, కిరణ్, పూనమ్, హావోబిజామ్ టెండెంథోయ్ దేవిల బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 15 ఈవెంట్లలో 37 మంది సభ్యుల బృందంతో (25 మంది పురుషులు, 12 మంది మహిళలు) పాల్గొంది. ఈ అద్భుత ప్రదర్శన రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత రోయింగ్‌కు కొత్త ఆశలను, అవకాశాలను సృష్టించింది.