Let's talk: editor@tmv.in
రోడ్డు భద్రత కోసం ఆధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

రోడ్డు భద్రత కోసం ఆధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణా శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. వాహనం నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక 'కంట్రోల్ రూమ్' వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వినూత్న ప్రాజెక్టును రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అధికారికంగా వెల్లడించారు. బస్సు డ్రైవర్ల ప్రవర్తనను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఈ విధానం రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

డ్యాష్‌క్యామ్‌లతో లైవ్ మానిటరింగ్

ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు చేసే తప్పిదాలను ఈ వ్యవస్థ ఇట్టే పట్టేస్తుంది. వాహనాల్లో అమర్చిన డ్యాష్‌క్యామ్‌ల ద్వారా డ్రైవర్ హావభావాలతో పాటు వాహనం ముందు భాగంలో జరుగుతున్న పరిణామాలను కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం వీక్షించవచ్చు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ధూమపానం చేయడం వంటి నిబంధనలకు విరుద్ధమైన పనులు చేస్తే ఈ సిస్టమ్ తక్షణమే అలర్ట్‌లను పంపిస్తుంది. ఈ హెచ్చరికలు అందిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది సదరు డ్రైవర్‌ను అప్రమత్తం చేసి ప్రమాదాలను నివారిస్తారని మంత్రి వెల్లడించారు.

కేవలం డ్రైవర్ ప్రవర్తన మాత్రమే కాకుండా వాహనం ఎంత వేగంతో వెళ్తుందనే అంశాన్ని కూడా ఈ సాంకేతికత ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే విచారణ నిమిత్తం ఈ డేటాను 8 రోజుల పాటు సర్వర్‌లలో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఐఆర్ఏ ట్రావెల్స్‌కు చెందిన 24 బస్సుల్లో ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తోందని మంత్రి తెలిపారు. రాబోయే 15 నుంచి 30 రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ బస్సులకు ఈ నిఘా నేత్రాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక్కో బస్సుకు సుమారు రూ. 12,000 ఖర్చు అవుతుందని నెలవారీ నిర్వహణ కోసం రూ.750 వెచ్చించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఈ వ్యయాన్ని భరించేందుకు బస్సు యజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 బస్సుల్లో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమర్చిన తర్వాత అధునాతన సదుపాయాలతో కూడిన భారీ కంట్రోల్ రూమ్‌ను అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

రోడ్డు భద్రత కోసం ఆధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు: - Tholi Paluku