Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
’రైల్‌వన్’లోనే.. అన్ని సేవలు

’రైల్‌వన్’లోనే.. అన్ని సేవలు

Pinjari Chand
6 మార్చి, 2026

భారతీయ రైల్వే డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మలుపు తిరిగింది. పదకొండు సంవత్సరాలకు పైగా అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్‌లో ప్రయాణికులకు సేవలందించిన యూటీఎస్(అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌కు మార్చి 1, 2026 నుంచి అధికారికంగా రైల్వే శాఖ వీడ్కోలు పలికింది. దాని స్థానంలో అన్ని రకాల రైల్వే సేవలను ఒకే వేదికపై అందించే రైల్‌వన్ సూపర్ యాప్‌ను పూర్తిస్థాయిలో అధికారులు అమలు చేశారు. టికెట్ బుకింగ్ నుంచి లైవ్ ట్రాకింగ్, భోజన ఆర్డర్ నుంచి ఫిర్యాదుల పరిష్కారం వరకు అన్నీ ఇప్పుడు ఒకే యాప్‌లో లభ్యమవుతాయి.

యూటీఎస్ ప్రయాణం – డిజిటల్ దిశలో తొలి అడుగు

2014 డిసెంబర్ 27న ప్రారంభమైన యూటీఎస్ (అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ ప్రధానంగా సాధారణ, ప్లాట్‌ఫాం, సీజన్ టికెట్ల బుకింగ్ కోసం రూపుదిద్దుకుంది. స్టేషన్ కౌంటర్ల వద్ద లైన్లలో నిలబడే ఇబ్బందిని గణనీయంగా తగ్గించింది. ముఖ్యంగా ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో సబర్బన్, లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది దైనందిన ప్రయాణికులకు ఇది ఉపయుక్తమైంది. ముందస్తుగా డబ్బులు నిల్వ చేసుకునే ఆర్-వాలెట్ సౌకర్యం క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించింది. కోట్లాది టికెట్లు ఈ యాప్ ద్వారా బుక్ కావడం డిజిటల్ వైపు రైల్వే అడుగులను బలపరిచింది.

అయితే యూటీఎస్ పరిమితులు స్పష్టంగా కనిపించాయి. ఇది కేవలం అన్‌రిజర్వ్డ్ టికెట్లకే పరిమితమైపోయింది. రిజర్వ్డ్ టికెట్లకు ఐఆర్‌సీటీసీ, ట్రైన్ స్థితికి ఎన్‌టీఈఎస్, ఫిర్యాదులకు రైల్ మదద్ వంటి వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఒకే వేదికపై అన్ని సేవలు కావాలనే డిమాండ్ పెరిగింది.

రైల్‌వన్ – సమగ్ర సూపర్ యాప్

2025 జూలై 1న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రారంభించిన రైల్‌వన్ యాప్‌ను రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ ఫార్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. మార్చి 1, 2026 నుంచి యూటీఎస్ సేవలను పూర్తిగా తనలోకి తీసుకున్న ఈ యాప్ ఇప్పుడు ‘మాస్టర్ యాప్’గా నిలిచింది.

రైల్‌వన్ ప్రధాన ఫీచర్లలో రిజర్వ్డ్, తత్కాల్, ప్రీమియం తత్కాల్, లేడీస్ కోటా, సీనియర్ సిటిజన్ కోటా టికెట్లు, అలాగే సాధారణ, ప్లాట్‌ఫాం, సీజన్ టికెట్లు ఒకే చోట బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. యూపీఐ, కార్డుల ద్వారా చెల్లింపులపై అన్‌రిజర్వ్డ్ టికెట్లకు ప్రోత్సాహక రాయితీ కూడా అందిస్తున్నారు. ట్రైన్ ప్రస్తుత స్థానం, ఆలస్యాలు, ప్లాట్‌ఫాం నంబర్లు వంటి రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. పీఎన్‌ఆర్ స్థితి, కోచ్ పొజిషన్, రిఫండ్ స్థితి కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రయాణంలో భోజనం ఆర్డర్ చేసుకునే ఈ-కేటరింగ్ సౌకర్యం, ఫిర్యాదుల నమోదు, అత్యవసర సహాయం వంటి సేవలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. యూటీఎస్, ఐఆర్‌సీటీసీ ఖాతాలతోనే లాగిన్ అయ్యే సౌకర్యం, బయోమెట్రిక్ మద్దతు, ఆర్-వాలెట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ మార్పిడి వంటి అంశాలు ప్రయాణికులకు అనుకూలంగా మారాయి.

స్వీకరణ – సవాళ్లు

లాంచ్ అయిన ఎనిమిది నెలల్లోనే రెండు కోట్లకు పైగా డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2026లో రోజుకు ఐదు లక్షలకు పైగా టికెట్ బుకింగ్స్ నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే ప్రారంభ దశలో లాగిన్ సమస్యలు, పేమెంట్ గ్లిచ్‌లు, టికెట్ అప్‌డేట్ ఆలస్యాలు వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

సమగ్ర దిశలో రైల్వే

డిజిటల్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. వేర్వేరు యాప్‌ల మధ్య గందరగోళాన్ని తగ్గించి, ఒకే వేదికపై సమగ్ర సేవలు అందించడం సమయానుకూల అడుగు. యూటీఎస్ ఒక యుగానికి ముగింపు పలికితే, రైల్‌వన్ మరో సమగ్ర డిజిటల్ దశకు నాంది పలికిందని చెప్పాలి. ప్రయాణం సులభం కావాలంటే సాంకేతికతే మార్గం అన్న నమ్మకానికి ఇది మరో ఉదాహరణ.

’రైల్‌వన్’లోనే.. అన్ని సేవలు - Tholi Paluku