
రైతులను కేంద్రం మోసం చేస్తోంది: రాహుల్ గాంధీ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) రూపురేఖలపై కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన విమర్శలను కొనసాగించారు. ఈ ఒప్పందం పేరుతో ‘భారత రైతులను మోసం చేస్తోందని అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో, అమెరికా నుంచి డిస్టిలర్స్ డ్రైడ్ గ్రైన్స్ (డీడీజీ) దిగుమతుల అర్థం ఏమిటో చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. అమెరికాలో జన్యుమార్పిడి (జీఎం) మొక్కజొన్నతో తయారు చేసిన డిస్టిలర్స్ ధాన్యాన్ని భారత పశువులకు మేతగా ఇస్తారా? అలా చేస్తే భారత పాల ఉత్పత్తి అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడే పరిస్థితి రాదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అలాగే, అమెరికా నుంచి జీఎం సోయాబీన్ నూనె దిగుమతికి అనుమతి ఇస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్ రైతుల పరిస్థితి ఏమవుతుందో వివరించాలని కోరారు. మరొక ధర షాక్‌ను వారు ఎలా తట్టుకుంటారు? అని ప్రశ్నించారు. ‘అదనపు ఉత్పత్తులు’ అంటే ఏమిటి? దీని అర్థం భవిష్యత్తులో పప్పులు, ఇతర పంటల మార్కెట్లను కూడా అమెరికా దిగుమతులకు తెరవాలనే ఒత్తిడి వస్తుందనే సంకేతమా? అని ఆయన అన్నారు. ‘నాన్-ట్రేడ్ బారియర్స్’ తొలగించడం అంటే ఏమిటో కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భవిష్యత్తులో జీఎం పంటలపై భారత వైఖరిని సడలించాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), కొనుగోలు విధానాలను బలహీనపరచాలని ఒత్తిడి వస్తుందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఈ తలుపు తెరిస్తే, ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను జాబితాలో చేర్చే ప్రమాదం లేదా? రైతులకు స్పష్టమైన సమాధానాలు కావాలి. ఇది నేటి విషయం మాత్రమే కాదు, భారత వ్యవసాయ రంగంపై దీర్ఘకాల ప్రభావం చూపే అంశమని ఆయన పేర్కొన్నారు.
కాటన్-టెక్స్టైల్ రంగంపై ప్రభావం?
ఇంతకుముందు శనివారం కూడా రాహుల్ గాంధీ, భారత-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో సుంకాల (టారిఫ్) విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధానమంత్రి మోడీపై ఆరోపణలు చేశారు. అమెరికాలో భారత వస్త్రాలపై 18 శాతం సుంకం ఉండగా, బంగ్లాదేశ్‌కు సున్నా శాతం టారిఫ్ ప్రయోజనం ఇస్తున్నారని, అయితే అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాలనే షరతు ఉందని ఆయన పేర్కొన్నారు. మనకు కూడా అదే ప్రయోజనం కావాలంటే అమెరికా పత్తి దిగుమతి చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు దాచారు? అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, ఎగుమతిదారులు రక్షణ పొందేలా ఒప్పందం చేయాల్సిందని, కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ విమర్శించారు.
