Let's talk: editor@tmv.in
రైతుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి

రైతుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి

Dantu Vijaya Lakshmi Prasanna
11 ఆగస్టు, 2026

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతుల సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో, ఏటీఎంఏ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం నెలకు సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నెలకు రూ.5,250 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

భగవంతుడి దయతో పాటు రైతుల కష్టంతో రాష్ట్రంలో ఈసారి పంటలు అద్భుతంగా పండాయని మంత్రి పేర్కొన్నారు. రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం రైతుల అవసరాలకు సరిపడా గోదాములను నిర్మించలేదని పొంగులేటి విమర్శించారు. దీంతో పంటల కొనుగోలు సమయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న గోదాముల కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త గోదాములను నిర్మించిందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నాయకులు రాజకీయ యాత్రలు చేపట్టడం ద్వారా రైతుల సమస్యలను రాజకీయం చేశారని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం విషయంలో మాటలకే పరిమితమైందని మంత్రి ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మక్కలకు క్వింటాల్‌కు రూ.200, రూ.300 చొప్పున అదనంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రం మక్కలు, జొన్నలకు మద్దతు ధర కల్పించి చిత్తశుద్ధితో కొనుగోలు చేసిందన్నారు.

భూముల విషయంలో వివాదాలు లేకుండా యజమానులకు హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే భూభారతి కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో తొలివిడతగా 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఈ సర్వేలకు భూ యజమానులందరూ సహకరించాలని కోరారు. భూహక్కుదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చేపట్టాలని మంత్రి సూచించారు. వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ పంటల ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని సూచించారు.

రైతుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి - Tholi Paluku