
రైతు సంక్షేమమే లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గురువారం శాసనసభలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో మంత్రి పలు అంశాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.14,664.33 కోట్లు జమ చేసినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8,903.10 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.5,761.23 కోట్లని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు.
ఎరువుల పంపిణీలో కొత్త విధానం
ఎరువుల పంపిణీలో అక్రమ మళ్లింపులు, అధిక ధరలు, రైతులు గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఏఐఎంఎస్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వాస్తవ సాగుదారు, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం ఆధారంగా రైతుకు అవసరమైన ఎరువులను శాస్త్రీయంగా నిర్ధారించి అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. 2026 అక్టోబర్ వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 9.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో 3.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 89 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉన్నట్లు వెల్లడించారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు రూ.800 కోట్లు
పంటల ధరలు పడిపోయినప్పుడు రైతులను మార్కెట్ పరిస్థితులకు వదిలేయకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుందని అచ్చెన్నాయుడు తెలిపారు. గత రెండేళ్లలో పొగాకు, ఉల్లి, మామిడి, కోకో, టమాటా, చీని తదితర పంటలకు సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా దాదాపు రూ.800 కోట్ల మేర సాయం అందించామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో విత్తనాల సరఫరా, మార్కెట్ ఇంటర్వెన్షన్ వంటి కీలక కార్యక్రమాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు పంటల బీమా రక్షణ కల్పించేందుకు నమోదు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు.
50 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం లక్ష్యం
రసాయనిక ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించి, అవసరమైన మేరకే ఎరువులు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం ద్వారా అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి AP AIMS, ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.
దమ్ముంటే సభకు వచ్చి చర్చించాలి
వైసీపీ నేతలు శాసనసభకు వచ్చి రైతుల సమస్యలపై చర్చించకుండా బయట కూర్చొని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపడ్డారు.
